Loading...

14, నవంబర్ 2017, మంగళవారం

ఉపయుక్తమైన కరదీపిక...'.మీరే జర్నలిస్ట్'


---- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
మీడియా విశ్లేషకులు, సైన్స్‌ రచయిత
ఆకాశవాణి - తిరుపతి
-----------------------

తప్పెట కొట్టి చాటింపు వేయడం నుంచి ఆండ్రాయిడ్‌ తట్టి మాట్లాడడం దాకా సాగిన మన కమ్యూఁకేషన్స్‌ ప్రస్థానాన్ని గమనిస్తే బోధపడేది ఏమిటి?
అచ్చుయంత్రం, టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌, రేడియో, టెలివిజన్‌, కంప్యూటర్‌, మొబైల్‌ సెల్‌ఫోన్‌ వంటి సమాచార సాధనాలు రావడంతో భావప్రసార విధానం, విఁయోగం విపరీతంగా పెరిగాయి. ఈ టెక్నాలజీ ఆధారంగానే కమ్యూనికేషన్‌ రూపం, స్వభావం, విస్తృతి మారుతూ వచ్చాయి.
తొలిదశలో భాష వృద్ధి చెందడంతో భావ వ్యక్తీకరణ విధానాలు మారాయి. దాంతో సమాచార ప్రసార మార్గాలు రూపొందుతూ వచ్చాయి. మలిదశలో దూరాన్ని జయిస్తూ, ఏక కాలంలో ఎక్కువ మందిని చేరగలిగే టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. అందులో కూడా మార్పులు ఎంత తీవ్రంగా, శీఘ్రంగా ఉన్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. టెలివిజన్‌ చానళ్ల వేగం ఏమిటో, దీనితో పోలిస్తే మొబైల్‌ దూకుడు ఏమిటో ఒకసారి పోల్చుకోండి!
ఈ మీడియా ప్రయాణంలో పదనిసలు చాలా ఉన్నాయి. ఇది వంద సంవత్సరాల క్రితపు తూర్పు దేశాల ముచ్చట. పత్రికల రాజ్యంలోకి రేడియో ప్రవేశించడం ఒక నిశ్శబ్ద విప్లవం. అచ్చుకావడం, పాఠకులను చేరడం అనే ప్రక్రియల్లో అంతర్భాగమైన ఆలస్యం, దూరం, నిరక్షరాస్యత అనే మూడు పరిమితులను రేడియో ఒక్కసారిగా దాటేసింది. ఫలితంగా పత్రికా యాజమాన్యాలకు కంటగింపు మొదలై, కట్టడి ఆరంభమైంది. అప్పటికి దినపత్రికలంటే సాయంకాల దిన పత్రికలే! పత్రికలు వెలువడి, పాఠకులకు చేరి, వారు చదివిన తర్వాతే` అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాతే రేడియో వార్తలు ఇచ్చేది. పత్రిక, రేడియో మాధ్యమాల మధ్య ఈ పెనుగులాట రెండవ ప్రపంచ యుద్ధందాకా కొనసాగింది. ఇది ఒక్క బ్రిటన్‌ అనుభవం మాత్రమే కాదు. చాలా దేశాల చరిత్ర. ప్రస్తుతం ఈ సంగతి తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయాల్లో పెద్దలదన్ను, దాదాగిరి ఎంత సహజమో? మీడియా సామ్రాజ్యవాదం కూడా అంతే సహజం!
పాతికేళ్ల క్రితం మన దేశపు జర్నలిజంలోకి ప్రయివేట్‌ టెలివిజన్‌ వినోద రంగం నుంచి ప్రవేశించింది. న్యూస్‌ టెలివిజన్‌ రాకతో పత్రికా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులు ఉలిక్కిపడి విమర్శలు గుప్పించారు. అటువంటి వాదాలు నేటికీ అడపాదడపా వినబడుతుంటాయి. టెలివిజన్‌ మాధ్యమం మేధావుల మాధ్యమం కాదని వీరి వాదం. అయితే అటు యాజమాన్యాలు ఇటు సంపాదకవర్గాలు న్యూస్‌ చానళ్లలోకి ప్రవేశించడమే కాదు. కీలక స్థానాలను కూడా అక్రమించారు.
ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి. టెలివిజన్‌ వచ్చేదాకా మీడియా అంటే పత్రికారంగమే! కానీ పిమ్మట దృశ్యం మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్‌ మీడియా అనే విభజన మొదలైంది. నేడు మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అని పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కంప్యూటర్‌ రావడంతో ఎలక్ట్రానిక్ రూపంలో అచ్చు పత్రికను పోలిన ఇమేజెస్‌ను ఇ`పేపర్లుగా చదువుకఁనే వెసులుబాటు కలిగింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియానా? ప్రింట్‌ మీడియానా? రెండింటికీ అవునూ అనీ, కాదూ అనీ జవాబు చెప్పొచ్చు. అందుకే దీనిని ‘న్యూ మీడియా’ అని పేర్కొన్నారు.
ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా న్యూస్‌ చానళ్ళు పత్రికలను తరిమితే, మధ్యాహ్నం నుంచి పత్రికలను చానళ్లు ఉరకలు పెట్టిస్తాయని భావించడం నిన్నటి వరకూ వాస్తవం. నేడు రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ ఆధిపత్యానికి అవలీలగా గండికొట్టింది సోషల్‌ మీడియా. టెలివిజన్‌ రిమోట్‌తో వీక్షకులు చానళ్లు మార్చడమే తప్ప చూడటం లేదు అనే విమర్శ ఉంది. సుళువుగా చానల్‌ మార్చగలగడంతో ముందుకొచ్చిన సమస్య ఇది. సోషల్‌ మీడియా అలా కాకుండా అరచేతిలో, నీకేమి కావాలో నీవు చూసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌలభ్యమే సోషల్‌ మీడియా విజయపాచిక. అంతకు మించి లైసెన్సు, టెక్నాలజీ, పెట్టుబడి, సిబ్బంది లేకుండా సమాంతరగళం వినిపించే, సమాంతర దృశ్యాల్ని చూపించే వేదికను సోషల్‌ మీడియా కల్పించింది. అందువల్ల పత్రిక, టెలివిజన్‌ ఆధిపత్యాన్ని దెబ్బతీయగలిగే సదుపాయం` ఈ ప్రపంచానికి ఈ సమయంలో అవసరమైన గొప్ప ఊరట. ప్రశ్నలకు దొరకని ప్రముఖులూ , పరీక్షలు ఎదుర్కోని సంస్థలూ సోషల్‌ మీడియాను చూసి బెదిరిపోవడంలో ఆశ్చర్యం లేదు. మరో విషయం కూడా గమనించాలి - సోషల్‌ మీడియాలో చదువరి, వీక్షకుడు, జర్నలిస్టు, వార్తాంశాల యజమాని ఒకరే! టెలివిజన్‌ చానల్‌కు ఫుటేజీ, వాయిస్‌ బైట్‌ పంపితే సిటిజన్‌ జర్నలిజం. ఇలా స్వీకరించిన వార్తాంశాలను గమనించి, అవసరమైతే కత్తిరించి చానల్‌లో ప్రసారం చేయవచ్చు. కానీ సోషల్‌ మీడియా ఒకే వ్యక్తి మీడియా వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, నియంత్రించే వ్యక్తి!
మనదేశపు మీడియా గురించి రెండు విషయాలను కీలకంగా భావించాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఉజ్వలమైన చరిత్ర భారతదేశపు పత్రికా రంగానిది. స్వాతంత్య్రోద్యమంతో ముడిపడిన భారతీయ పత్రికారంగం దేశవాసులందరినీ కలపడంలోనూ, వారిని ప్రగతిశీలదారుల్లో నడిపించడంలోనూ గొప్ప పాత్రపోషించింది. టెలివిజన్‌ రంగం మాత్రం ప్రపంచీకరణతో ప్రాణం పోసుకుని విస్తరించింది. ఇక్కడ వాణిజ్యమే ఊపిరి. మిగతా అంతా ఊక, ఉబుసుపోక! అందుకే టెలివిజన్‌ తెరపై రక్తికట్టిన వాణిజ్య చమత్కారాలు నేటికీ పత్రికల్లో రసాభాస అవుతున్నాయి. డెబ్బయ్యేళ్ల క్రితపు విలువలు నేటి మీడియా రంగంలో వెతికి భంగపడుతున్న వ్యక్తులకు కొదవ లేదు. ఒకే సంస్థకకు ఒకే చోట నుంచి పత్రిక ప్రచురణను, చానల్‌ ప్రసారాన్ని అమెరికా వంటి దేశాల్లో కూడా అనుమతించరు. దీనిని క్రాస్‌ మీడియా రెగ్యులేషన్‌ అంటారు. అలాంటి నియమాలు రూపుదిద్దుకోక ముందే మన దేశపు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్పోటనం సంభవించింది. నేడు సోషల్‌ మీడియాకు సంకెళ్లు అవసరమని కొందరు వాదిస్తూ, కొన్ని కారణాలు చూపిస్తున్నారు.
నేడు ఏ మీడియా కూడా సేవ కాదు. ఫక్తు వాణిజ్యం, వ్యాప్తి, లాభార్జన ధ్యేయం. అయితే దీనిని బాహాటంగా చెప్పుకోకఁండా లాఘవంగా తప్పుకుంటారు. మీడియా అంటే వాణిజ్యమే కాదు. అధికారం, రాజకీయం కూడా! కనుకనే పార్టీలకు చానళ్లున్నాయి. ముందు ముందు మీడియా సంస్థలకు పార్టీలు వచ్చినా ఆశ్చర్యపోకూడదు!
******** ****** ********
ఇంత పరిణామశీలంగల, , ప్రభావవంతమైన మీడియాను ఎలా అధ్యయనం చేయాలి? ఒక పరిణామాన్నీ, దాని ప్రభావాలను గమనించే లోపు మరిన్ని పరిణామాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీడియాపై సమగ్ర అవగాహన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ద్వారా లభిస్తుందా? మీడియా సంస్థల శిక్షణాకాలంలో దక్కుతుందా? చాలా మౌలికమైన ప్రణాళికలో సాగే విశ్వవిద్యాలయ కోర్సు ప్రయోజనం పరిమితం. ఇక మీడియా సంస్థలో ఇచ్చే శిక్షణలు ఆ సంస్థ అవసరాలు, దృక్పథాల్ని బట్టి ఉంటాయి కానీ, సమాంతర వాదాలు కానీ, సమగ్రమైన అవగాహన కానీ సాధ్యం కావు. అందుకే నిజమైన జర్నలిస్టులు ఏకలవ్యులుగా ముందుకు సాగాలి. కనుకనే ఎక్కువ అపజయాలు, తక్కువ సంఖ్యలో అపురూప విజయాలు ఎదురవుతాయి. మరి మీడియా పాండిత్యం, నైపుణ్యం ఎలా సాధ్యపడతాయి? మీడియాని పరిశీలించడమే ఏకైక అధ్యయన మార్గం! వందల సంఖ్యలో పత్రికలు, చానళ్లు ఉన్నప్పుడు, వీటికి మించి సోషల్‌ మీడియా విజృంభిస్తున్నప్పుడు మీడియా పరిశీన ఎలా సాధ్యం? ఇది సాధ్యపడే విషయం కాదు పూర్తిగా! కానీ ఇదే ఏకైక మార్గం. దీనికి కొంత ఊతంగా తోడ్పడేవి మీడియా గురించి వెలువడిన పుస్తకాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి పుస్తకాలు అపురూపం కానీ, ఇటీవల ఏన్నో రకాల మీడియా గ్రంథాలు వెలువడ్డాయి, ఇంగ్లీషుతో పోలిస్తే తెలుగులో మీడియా గ్రంథాలు తక్కువే కావొచ్చు. కానీ వైవిధ్యం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో మీడియాపై తగిన అవగాహన కలిగించే పుస్తకం ` బెందాళం క్రిష్ణారావు గారి ‘మీరే జర్నలిస్ట్‌’ అనే ఈ పుస్తకం. గతంలో ‘వార్తలు ఎలా రాయాలి?’ అనే వీరి పుస్తకం 2006లో వచ్చింది. అంతవరకు వారు నాకు తెలియదు. హైదరాబాదు, విజయవాడ వంటి నగరాల నుంచి కాకుండా శ్రీకాకుళం నుంచి ఈ పుస్తకం వెలువడడం ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించింది. తర్వాత రచయిత వివరాలు తెలియడం, స్వయంగా కలవడం... అలా మా అనుబంధం మొదలైంది. వారికి సమాజం పట్ల ఆసక్తి, వృత్తి పట్ల బాధ్యత ఉన్నాయి. బౌద్ధం పట్ల , మార్క్సిజం, అంబేద్కరిజం పట్ల అభిమానం, గౌరవం, సాహిత్యం పట్ల అభిలాష ఉన్నాయి. సుమారు మూడొందల డెబ్బయి పేజీల ఈ గ్రంథంలో తొంబయి రెండు అంశాలున్నాయి. నిజానికి ఒక్కో అంశం మీద ఒకో పుస్తకం రాయడానికి ఆస్కారం ఉంది. కనుక మితి లేదు. అయితే చాలా వరకూ అవగాహన కలిగించడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. అదే సమయంలో ఇందులో జత చేయడానికి ఎన్నో అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొంతకాలం సంపాదకీయాలు ప్రచురించకఁండా, మరికొంత కాలం ఎక్కడబడితే అక్కడ సంపాదకీయాలు ప్రచురించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక కొన్ని సంవత్సరాలుగా కీలకమైన వార్త ఇచ్చే చోట ‘టైమ్స్‌ వ్యూ’ అని క్లుప్తంగా ఇస్తోంది. సంపాదకీయం అంటూ విడిగా ప్రచురించని ‘మింట్‌’ పత్రిక తొలిపుటలో ‘క్విక్‌ ఎడిట్‌’ అని పది పన్నెండు వాక్యాల వ్యాఖ్య రాస్తుంది. అంతా కుదించుకుని, కుచించుకుని పోతున్న సమయంలో ‘న్యారేటివ్‌ జర్నలిజం’ మళ్లీ ఆసక్తి కలిగిస్తోంది. ‘క్యారవాన్‌’ మాసపత్రిక, ‘మింట్‌’ దినపత్రిక ఈ తరహా జర్నలిజానికి ఉదాహరణలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి 1960లో ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఆరంభమైనప్పుడు ‘పెత్తందార్‌’ అనే కార్టూన్‌ స్ట్రిప్‌ ప్రతిరోజూ వేసేవారు. తెలుగులో వారిదే తొలి స్ట్రిప్‌ కార్టూన్‌. ఇలా ఎన్నో విషయాలుండొచ్చు. ఈ పుస్తకంలో బెందాళం క్రిష్ణారావు గుదిగుచ్చిన అంశాల జాబితా కూడా ఇలానే ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రకంగా కూడా ఇది ఒక బుల్లి జర్నలిజపు సర్వస్వం! కనుకనే వారికి నా అభినందనలు.
( మీరే జర్నలిస్ట్....పుస్తకానికి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు రాసిన విలువైన ముందుమాట )
***********************

24, అక్టోబర్ 2017, మంగళవారం

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు

 యం.యస్‌. సుబ్బులక్ష్మి గురించి అధ్యయనం 2004వ సంవత్సరంలో ఒక ''వెలుపలి వ్యక్తి'' నుంచి, అదీ తన క్రైస్తవ తల్లిదండ్రులు పెట్టిన పేరుగల వ్యక్తి నుంచి రావటం, కర్ణాటక సంగీత సామ్రాజ్యపు కంచుకోటలో కలవరం రేపింది. నేను తమిళనాట పెరగలేదనే విషయం దానిని మరింత అనుమానాస్పదం చేసింది. ఐతే తొందరలోనే క్షమాభిక్ష వచ్చింది, కొంత మెచ్చుకోలు కూడా దొరికింది. ఐతే మొదట వచ్చిన అభ్యంతరాలు, ఇటీవలి కాలం వరకూ కర్ణాటక సంగీత ప్రపంచాన్ని పరిపాలించిన కొన్ని బృందాలకున్న సెంటిమెంట్లను ఎత్తిచూపాయి. 

యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మకి మతం, భాషా ఎలాంటి సమస్యలనూ తెచ్చిపెట్టలేదు. ఒక బాల మేధావిగా ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో సంగీతాకాశంలో ఉదయించినప్పుడు ఆమె సాంఘిక నేపథ్యం ఆమెపై నిర్హేతుకమైన అయిష్టతను కల్పించి బాధించింది. భారతదేశపు సంప్రదాయ పరాయణ సాంఘిక వాతావరణంలో ఆచారాల కట్టుబాట్ల బిగింపు చూసినప్పుడు వందేళ్ళ క్రితం ఉన్న అపోహలు, అభిప్రాయభేదాలు ఇప్పటికీ సజీవంగా ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. సంగీతంలోనూ, రాజకీయ జీవితంలోనూ ప్రజాస్వామ్యాన్ని కోరుతూ కొత్తతరం కళాకారులు ప్రవేశించారు. శ్రోతల దృక్కోణాలలో, వారాశించేదానిలో కొత్త పద్ధతులు వచ్చాయి. వర్తమానాన్ని ఉత్సాహవంతంగా చేసి, భవిష్యత్తుని మార్చేవిగా వున్న సవాళ్ళు కర్ణాటక సంగీత సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.

16వ శతాబ్దంలో పురందరదాసు ప్రపంచంలోనే అతి కఠినమైన గణిత పూర్వక సంగీత నిర్మాణానికి పునాదులు వేసినప్పటి నుంచీ ఈ సంగీతం ఒక నిరంతరాయపు తేజస్సును తనలో శాశ్వతంగా ముద్రించుకున్నది. రెండు శతాబ్దాల తర్వాత ముగ్గురు అత్యంత ప్రతిభావంతులు, కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా మనకు తెలిసినవారు ఒకే గ్రామంలో సమకాలీనులుగా పుట్టటంతో శాస్త్రీయ యుగోదయం జరిగింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రిలు ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలు కర్ణాటక సంగీతోత్సవ సంవత్సరాలకూ, ఇరవయ్యవ శతాబ్దపు స్వర్ణయుగానికీ దారితీశాయి. ఈ కాలంలో నైపుణ్యత ఎంతగా పెరుగుతూపోయిందంటే, ఈ కాలంలోనే మహిళా సంగీతకారులలోనే 'త్రిమూర్తులు' అనే పేరుతో రెండు జట్లు రావటం మనం చూశాం. ఈ పుస్తకం ఏ సాహసవంతులకు అంకితమయిందో వారు ఒక జట్టయితే, తర్వాత అందరితో ఆరాధింపబడిన యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ, డి.కె. పట్టమ్మాళ్‌, ఎమ్‌.ఎల్‌. వసంతకుమారిలు మరొక జట్టు. స్వర్ణయుగాన్ని కొనసాగిస్తూ ఆధునిక యుగం ప్రారంభమైంది. అద్భుతమైన గాయకులు ప్రతి ఇంటా చెప్పుకునే పేర్లయ్యారు. ఇరవయ్యవ శతాబ్దానికి, ఇరవయ్యొకటవ శతాబ్దానికీ మధ్యకాలంలో సంచరించే కొత్త తరం - ప్రతిభ కలిగిన విద్యావంతులైన స్త్రీ పురుషులతో కర్ణాటక సంప్రదాయానికి వారి పద్ధతులలోనే న్యాయంచేస్తూ ప్రవేసించింది. వాళ్ళు మన చుట్టూ, ఒకే సమయంలో ప్రేరణనీ, భయాన్నీ కలిగిస్తూ, వారి మార్గాలలో సౌకర్యవంతంగా 

ఉంటూ, భిన్నంగా ఉన్నందుకు భయపడకుండా ఉన్నారు. సంజయ్‌ సుబ్రమణ్యన్‌, పి. ఉన్నికృష్ణన్‌, అభిషేక్‌ రఘురామ్‌ అటువంటి వాళ్ళలో కొద్దిమంది మాత్రమే. ఈ సోదరుల జాబితాలోంచి ఒక పేరుని విడిగా తీసి చెప్పాలంటే, అటి టి.యమ్‌. కృష్ణ, గాయకుడు, పండితుడు, సామాన్య ప్రజానీకపు విశ్వాసాలపై, విలువలపై దాడిచేసినవాడు. మూడు గుణాలు ముప్పేటగా కలిగినవాడు. సామాజిక వాతావరణంలోకి అతను బలవంతంగా ప్రవేశపెట్టిన విషయాలు, యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ తన పదవ యేట మొదటి రికార్డు ఇచ్చినప్పుడు ఆమెను వెంటాడిన భయాలే.

ఆ కాలంలో ఆందోళన, చిరాకు కలిగించే సమస్యలు లేవంటే - తక్కువ కులాలకు చెందిన కళాకారులను, ఉన్నత కులాలవాళ్ళు అంగీకరించకపోవటం, మహిళా గాయకుల పట్ల పురుషులకున్న అభ్యంతరాలు. యమ్మెస్‌ ఈ రెండింటినీ అధిగమించింది. అందుకు ఆమె సంగీతపు మహా ఔన్నత్యానికి ఆమెను సంస్కృతీకరించటంలో ఆమె భర్త చేసిన తెలివైన నిర్వహణకు మనం ధన్యవాదాలు చెప్పాలి. కానీ సమస్యలు అంతటితో తీరిపోలేదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ''మీరా'' సినిమా (1945) విడుదలయ్యేనాటికి టి.యమ్‌. కృష్ణన్‌ పుట్టలేదు. ఇంకా చెప్పాలంటే మొదటి కొత్తతరపు విప్లవం తెచ్చిన ఫ్లవర్‌ చిల్డ్రన్‌, సమ్మర్‌ ఆఫ్‌ లవ్‌ (1967) సమయంలో కూడా ఆయనలేడు. దాదాపు ఒక దశాబ్దం గడిచాక, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ఆరునెలలు గడిచాక ఆయన వచ్చాడు. కానీ అప్పుడాయన కర్ణాటక సంగీతాన్ని ''బ్రాహ్మణాధిపత్యంతో, పురుషాధిపత్య నిరంకుశ ధోరణి''లో ఉందని, దానికి ''సాంఘిక పునర్నిర్మాణం'' అవసరమని వర్ణించాడు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.

కృష్ణను తేలిగ్గా తీసిపారెయ్యలేము. అయన తమిళనాడులోని 2.75% బ్రాహ్మణ వర్గంలో భాగమని మాత్రమే కాదు; అతని చర్యలు అతని మాటలను బలపరిచాయి. మద్రాసులో వందేళ్ళ నుంచీ జరుగుతున్న మార్గఝి సంగీత సీజన్‌ నుంచి అతను బైటికి వచ్చేసి, కళలలో ఉన్న వివక్షను ప్రతిఘటించాడు. నగరంలోనే ప్రముఖమైన సభా మంటపాలలో కచేరీలు జరుగుతున్నప్పుడు ఆయన సముద్రతీరంలో జాలర్లకోసం కచేరీ ఏర్పాటు చేశాడు.

కృష్ణ చేసే కొన్ని వాదనలు నిజానికి అతి అనిపిస్తాయి. బహుశ తమిళ బ్రాహ్మణ ఆధిపత్యం సంస్థాగత స్థాయిలో మాత్రమే ఉందేమో. కళాస్థాయిలో తమిళులు కానివాళ్ళు, బ్రాహ్మణేతరులు కూడా ప్రతిభతో ఉన్నతస్థాయికి ఎదిగారు. ''శాస్త్రీయ'' అనే పదం అంటేనే, ''మరీ ఉన్నతులది''గా పేర్కొనటాన్ని అనుమానించాలి. కళ, సాహిత్యం వీటన్నిటినీ వర్గీకరించేటప్పుడు 'శాస్త్రీయ' అనేమాట వాటిలో ఒక ఉన్నతస్థాయికి చేరాలనే ఆశను ఎత్తిచూపుతుంది. కానీ ''సంగీతాన్ని ఆనందించాలన్నా, నేర్చుకోవాలన్నా కొన్ని సాంఘిక, మతపరమైన అవసరాలను సృష్టించటం'' గురించి అతను చేస్తున్నదాడి గురించి కూడా ఆలోచించవలసిందే. కర్ణాటక సంగీతం ''మతపరమైన హిందూ అనుభవంగా కనిపించేలా'' ఉండకూడదనే అతని వాదనలోనూ విషయముంది.

హిందూస్తానీ సంగీతంలో మతపరంగా కనిపించే ఛాయలు కనిపించవు. (ముస్లింల కారణంగానూ, వారున్నప్పటికి - మనం చూసే దృష్టి కోణాన్నిబట్టి). కొన్ని అంచనాల ప్రకారం ఉత్తర భారత సంగీతానికి దక్షిణాదిన విపుల ప్రజాదరణ పెరుగుతోంది. కర్ణాటకలో ఆ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది; కర్ణాటక సంగీత వ్యాకరణాన్ని పురందాసు ఎక్కడ శ్రమించి ఏర్పరిచాడో, అక్కడ భీమ్‌సేన్‌ జోషి, గంగూబాయ్‌ హంగల్‌ హిందూస్థానీ సంగీత ఇంద్రజాలాన్ని వ్యాపింపజేశారు. ఆ ఇంద్ర మాయాజాలం కొనసాగితే దానికి ఒక కారణం, ఉత్తరాది సంప్రదాయం సాపేక్షంగా చూస్తే తేలికగా అందుకునేందుకు వీలుగా ఉండటమే. దక్షిణాది పద్ధతి చాలా కఠినం కావటంతో గొప్పవాళ్ళెవరూ శిష్యులను మిగిల్చి వెళ్ళరు.  కర్ణాటక శుద్ధ సంగీత సారమైన వీణ ధనమ్మాళ్‌కి ఆమె బాణీలో ఆమె శైలిలో పాడేందుకు ప్రయత్నించేవారసలు లేరు. బాల సరస్వతి, బెంగుళూరు నాగరత్నమ్మకి కూడా అంతే. ఆధునిక సంగీత పండితులు చెంబై వైద్యనాధ భాగవతార్‌ నుంచి జి.యన్‌. బాలసుబ్రహ్మణ్యం వరకూ - వారందరినీ సంగీతజ్ఞులైన శ్రోతలు విని ఆనందించారు గానీ వారి సంఖ్య ఊగిసలాడుతూ ఉంటుంది. కారణం వివరించలేనిది కాదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ఒక్కతే ప్రజాదరణ ఏమాత్రం తగ్గని కర్ణాటక గాయని. నిజానికి ఆమెకు ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. ఆమె పాడిన 'సుప్రభాతం' క్యాసెట్ల అమ్మకాన్ని లెక్కలోకి తీసుకుంటే -

సుప్రభాతం గాఢమైన భక్తి విషయంలోనూ, పాడే పద్ధతిలోనూ, యమ్మెస్‌ భక్తి సంగీతం అందంగా, ఉన్నతంగా మరువలేనిదిగా ఉంటుందని ఒప్పుకుంటూనే, టి.యమ్‌. కృష్ణ తను రాసిన ''దక్షిణాది సంగీతం'' అనే పాఠకాదరణ పొందిన పుస్తకంలో ఇలా రాశాడు ''కఠినమైన సంగీత కళలోని గాంభీర్యాన్నంతా కలిగిన మరో ''యమ్మెస్‌ సంగీతం'' ఉండగలిగేది, నిజంగా తయారయ్యేది. దానిని ''దైవత్వ యమ్మెస్‌'' అనే లెజెండ్‌ వల్ల కోల్పోయాం.''

విషాదగీతంలా కనిపించే పైమాట నిజానికి ఉత్సవ గీతమనే చెప్పాలి. ఎందుకంటే ఆ దైవత్వపు లెజెండ్‌ సంగీత కళలోని శృతిలయబద్ధతను తగ్గించలేదు. యమ్మెస్‌ సంగీతం తన సమకాలీనులెవరలోనూ లేనంతగా అన్నిటినీ కలుపుకుని కాంతిని కాపాడుకుంది. ఆమె పాడటం మొదలుపెట్టిన తొంభై సంవత్సరాలలోనూ ఆ కాంతి ఎన్నడూ తగ్గలేదు. 2016లో ఆమె శతజయంతి ఒక చరిత్రాత్మక గుర్తుగా మారుతుంది. భారత ప్రభుత్వం సాంస్కృతిక సంపదతో దేశాన్ని మానవాతీతంగా చేసిన ఏడుగురు ఐకాన్స్‌ని ఎంచుకున్నప్పుడు ఆ ఏడుగురిలో సుబ్బులక్షి ్మ బిస్మిల్లాఖాన్‌తోపాటు ఉంది. బహుశ, ఇంకా ప్రముఖంగా, యమ్మెస్‌ వందవ పుట్టినరోజు సందర్భంగా ఆమె జన్మస్థలమైన మధురైలో ఒక ప్రత్యేక సంగీత నివాళిని మునిమనవరాలైన యస్‌. ఐశ్వర్య (టి. సదాశివం కూతురు, అర్థ శతాబ్దర పాటు యమ్మెస్‌కి గాత్ర సహకారం అందించిన రాధా విశ్వానాధన్‌ మనవరాలే ఐశ్వర్య) అర్పించటం జరుగుతుంది. యమ్మెస్‌ బాణి కొనసాగుతుందనేందుకు అంతకంటే ఉచితమైన నిదర్శనం ఉండదు. దాని గురించి రాధ ఇలా వివరించారు. ''కేవలం పాడటం కాదు, జీవితంలోనూ సంగీతంలోనూ భక్తి, వినమ్రతలుండటం''. శాస్త్రీయ కళలు కాలంతోపాటు నడుస్తూ తమ శాస్త్రీయతను నిలుపుకుంటున్నప్పుడు, యమ్మెస్‌ సంగీతం తాను సంకేతంగా ఉన్న విశ్వజనీన సుగుణాలతో కాలానుగుణంగా నిలిచి ఉంటుంది. నెమ్మదిగా కానీ చాలా గట్టిగా యమ్మెస్‌ కాలాతీతమైన విలువలను ఎత్తిపట్టి, ఆ క్రమంలో తను కూడా కాలతీత మయ్యారు. యమ్మెస్‌ జీవిస్తున్నారు.

మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 


ప్రతులకు, వివరాలకు : 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 240, వేల ,150/-

16, జూన్ 2013, ఆదివారం

తిరుమల రామచంద్రపరిశోధనా పారంగతుడు-

తిరుమల రామచంద్ర


సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, పరిశోధకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు తిరుమల రామచంద్ర. సంస్కృతం, ప్రాకృతం, హిందీ, కన్నడం, తమిళం, ఆంగ్లం, ఆంధ్ర భాషలలో అనితరసాధ్యమైన పాండిత్యం, పరిశోధనా పాటవంతో వారు చేసిన రచనలు - తెలుగు భాష, సాహిత్య ప్రియులకు కరదీపికలు. సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలలోని అనేక అపురూప రచనలను తెలుగులో అనుసృష్టి చేశారు. శతాధిక రచనలు వారు చేసినప్పటికీ, ఇప్పటికీ దాదాపు పాతిక మాత్రమే పుస్తకరూపంలో వచ్చాయి. చీకటి కోణాల్లో దాగున్న తెలుగుకు తన పరిశోధనల ద్వారా వెలుగునిచ్చిన తిరుమల రామచంద్ర రచనలు తిరిగి తెలుగువారికి అందకుండా అంధకారంలో మ్రగ్గడం క్షంతవ్యం కాదు.
తిరుమల రామచంద్ర వ్రాసిన 'మన లిపి-పుట్టు పూర్వోత్తరాలు' అయినా, 'నుడి-నానుడి' అయినా 'సాహితీ సుగతుని స్వగతం' అయినా, 'మరుపురాని మనీషులు' అయినా, 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు అయినా ఏ ఒక్కటి అమెరికా లాంటి పశ్చిమదేశంలో రచించి ఉంటే పరిశోధనాత్మక రచనలకుగాను జర్నలిస్టులకిచ్చే 'పులిట్జర్' అవార్డు ఎప్పుడో వచ్చి ఉండేది. ఆయన చివరి రోజులలో వ్రాసిన ఆత్మకథాత్మక రచన 'హంపీ నుంచి హరప్పాదాకా' జ్ఞానపీఠ్ అవార్డు రాదగినది.
తెలుగులో ఇంత చక్కని, చిక్కని, అక్కున చేర్చుకోదగిన జీవిత చరిత్ర మరొకటి రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరించిన రెండు నెలల్లో వెలువడిన అపూర్వ గ్రంథం 'మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు'. ఎన్నో క్రొంగొత్త అంశాలు చెప్పిన ఈ గ్రంథం భారతీయ భాషలలో సమగ్రమైనది. ఇంతవరకు ఇలాటి గ్రంథం రాలేదు. అలాగే భాషాశాస్త్రాన్ని మానవజాతి శాస్త్ర, సాంఘిక శాస్త్ర, చరిత్రాదులతో సమన్వయించి రచించిన మరో అపూర్వగ్రంథం - 'నుడి-నానుడి'. వివిధ దృక్కోణాలతో వ్రాసిన ఇలాంటి గ్రంథం కూడా మరొకటి లేదు. ప్రాకృత-తెలుగు సాహిత్యాలకు రెండువేల సంవత్సరాలకు పైగా సంబంధం ఉందంటారే తప్ప - వివరణాత్మకంగా వ్రాసినవారు లేరు. ఈ నేపథ్యంలో 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు వెలికితీసి పుస్తకరూపం ఇచ్చారు. గాథాసప్తశతిని కాళిదాసు అనుకరించాడని ఈ గ్రంథంలో తిరుమల రామచంద్ర సిద్ధాంతీకరించి చెప్పారు. 'సాహితీ సుగతుని స్వగతం', 'మరుపురాని మనుషులు' మౌలిక వ్యాస సంపుటాలు. ఈ గ్రంథాలు ఆ రోజుల్లో నాలాంటి సాహితీ ప్రియులకు, యువ జర్నలిస్టులకు, విద్యార్థులకు స్ఫూర్తిగ్రంథాలు.
ఇంతటి పరిశోధనా పారంగతుడు తిరుమల రామచంద్ర ప్రమాదీచనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి జ్యేష్ఠ నక్షత్రంలో అంటే సరైన తేదీ 1913 జూన్ 17న జానకమ్మ - శేషాచార్య దంపతులకు జన్మించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుభాష, సాంస్కృతిక వికాస సంవత్సరంగా ప్రకటించిన ఈ యేడాదే తెలుగుభాషా సేవకుడుగా తనకుతానే ఎంతో గర్వంగా బతుకున్నంతకాలం చెప్పుకున్న తిరుమల రామచంద్ర శతజయంతి సంవత్సరం రావడం యాదృచ్ఛికమైనా, ప్రభుత్వం దానికి సంబంధించిన భాషా, సాంస్కృతిక సంబంధిత సంస్థలు శ్రద్ధ వహించి ఘనంగా నిర్వహించవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇంతవరకు పుస్తకరూపంలోకి రాని వారి రచనలు సేకరించి, వరుసగా ప్రచురించవలసిన తరుణమిది. 1997 అక్టోబర్ 12న కన్నుమూసిన తిరుమల రామచంద్ర ఎనభై నాలుగేండ్ల వయస్సులోను అప్పుడు జర్నలిస్టుగా చురుకుగా పనిచేస్తున్న నాలాంటి వారితో కలిసి ఎన్నో సభల్లో పాల్గొన్నారు.
మరెన్నోసార్లు తమ అనుభవాలు, జీవిత విశేషాలు, భాషా సాహిత్య విషయాల పరిశోధనలో అనుసరించిన పద్ధతులు చెప్పారు. వయస్సురీత్యానే కాకుండా, పాండిత్యపరంగా ఎలాంటి భేషజం లేకుండా మనసువిప్పి మాట్లాడే స్వభావం కలిగిన తిరుమల రామచంద్ర జీవిత, సాహిత్య సేవలను దిజ్మాత్రంగా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ వ్యాసం.
తిరుమల రామచంద్ర నడిపిన శీర్షికలలో మరుపురాని మనీషులు, నుడి-నానుడి (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక) తెలుగు వెలుగులు (ఆంధ్ర సచిత్ర వారపత్రిక) సాహితీ సుగతుని స్వగతం (భారతి) ఆయనకు ఎనలేని కీర్తిని, తెలుగుకు అపురూప సాహిత్య సంపదను ఒనగూర్చాయి. ఇవి కాకుండా వారు మనవి మాటలు (భారతి), చరిత్ర కెక్కని చరితార్థులు (పరిశోధన), తెలుగుతల్లి, మాటలకథ, పదసంపద, సంస్కృతి సంప్రదాయ (ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక), మాండలికాలు, పలుకుబడి, హైదరాబాద్ లేఖ (ఆంధ్రప్రభ), హైదరాబాద్ నోట్‌బుక్ (ఆంధ్రపత్రిక), రాజధాని విశేషాలు (ఆంధ్రప్రదేశ్), ఇదీ మన రాజధాని (ప్రజాతంత్ర) విజయవంతంగా నిర్వహించారు. కేవలం వారి పేరుతోనే కాకుండా సుమారు పాతిక వేల కలం పేర్లతో వారెన్నో రచనలు చేశారు. కన్నడం నుంచి పది, పన్నెండు నవలలు, కథా సంకలనాలు అనువదించారు. హిందీ, ఇంగ్లీషు నుంచి సుమారు ముఫ్పై గ్రంథాలు అనువదించారు.
తిరుమల పరిశోధనాత్మక రచనలలో పేర్కొనదగినవి 'హిందువుల పండుగలు-పర్వాలు', 'తెలుగు పత్రికల సాహిత్య సేవ', మూడు వాఙ్మయ శిఖరాలు, అహంభో, అభివాదయే, బృహదారణ్యకం, మనవి మాటలు, బుద్ధుణ్ణి బళ్ళోవేశారు లాంటివి. అనువాదాల్లో లలితవిస్తరం, అవధాన కల్పలత చెప్పుకోదగినవి. లలితవిస్తరం మహాయాన బౌద్ధ సంప్రదాయాను సారమైన బుద్ధుని చరిత్ర. భారతదేశంలోనే ఇది మొట్టమొదటి లౌకిక వచనమనీ, క్రీస్తుకు ముందు మూడు శతాబ్దాల నాడు రచించిందని రామచంద్ర అభిప్రాయం. మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైనవారు లలిత విస్తరాన్ని ప్రస్తావిస్తూ దీనిలో విపుల సంగతి ఉందని, క్రీడల సంగతి అనేవారు. దీనికి రాజేంద్రలాల్ మైత్రా సంగ్రహ అనువాదం ఆంగ్లంలో ఉంది గానీ, యథామూలాను వాదం ఏ భాషలోను లేదు. రామచంద్ర, ప్రముఖ విద్వాంసులు బులుసు వెంకట రమణయ్య కలిసి దీనిని మక్కీకిమక్కీ అనువదించారు. మొదట ఇది 1962లో ఆంధ్రప్రభ ఆదివారం సారస్వతానుబంధంలో ధారవాహికంగా ప్రచురితమై పుస్తకరూపం పొందింది.
అనువాదం చేసే పద్ధతిలో ముఖ్యంగా తెనుగు తోబుట్టువుల అనువాదంలో రామచంద్ర మక్కికి మక్కి వాది. అంటే తెలుగు నుడికారం విడనాడి యథామూలమని కాదు.
పఠనీయత ఉండాలి. మూలానుసారిగాను ఉండాలి. సంక్షేపీకరణం, సారాంశకథనం ఆయనకు ఒప్పదు. ఉదాహరణకు ఒక సన్నివేశం. రామచంద్ర దక్షిణ భారత పుస్తక సంస్థ వారికి కొన్ని కన్నడ అనువాదాలు చేశారు. వాటిలో ఒక కథలో ఒక ఆఫీసరు కోపంతో ఆఫీసులో ప్రవేశించే భార్య కరాఘాతాలు తప్పించుకొనడానికి పెద్ద ఫైలును తల మీద పెట్టుకుంటాడు. అతడు దానిని టీకాచార్యులు హయగ్రీవుని కోసం శనగల పూర్ణం పళ్లెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అని రచయిత వర్ణించారు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు ద్వైత మతానుసారంగా మధ్వాచార్యుల వారు భాష్యం రాశారు. దానికి అణు భాష్యమని పేరు. దానికి జయతీర్థుల వారు టీక రాశారు. కనుక ఆయనకు టీకాచార్యులని పేరు. అది కూడా కఠినమని శ్రీపాదరాయలనే విద్వాంసులు మరొక వ్యాఖ్య రాశారు. శ్రీపాద రాయలకు హయగ్రీవుడు ప్రత్యక్షమని ఐతిహ్యం. శ్రీపాదరాయలు ఉడికించిన సెనగలు బెల్లం పళ్ళెంలో పెట్టుకుని తల మీద మోసుకుని గుదిగాళ్ళతో కూర్చుంటే హయగ్రీవుడు అశ్వరూపంలో వచ్చి, తన ముందు కాళ్ళు శ్రీపాదరాయల మోకాళ్ళపై పెట్టి ఈ బెల్లం శనగలు తినేవాడట. ఈచిత్రం ఏ ఉడిపి హోటలులోనైనా గోడకు వ్రేలాడుతూ ఉంటుంది. ఈయనకు కూడా టీకాచార్యులని పేరుంది. కొందరు దీనికి ఒప్పరు. టీకాచార్యులు పళ్ళెం నెత్తి మీద పెట్టుకున్నట్టు అనే ఉపమానం కన్నడంలో విద్యావంతులకు తెలిసిన సంప్రదాయం. రామచంద్ర ఆ విధంగానే వ్రాసి క్రింద అథస్సూచికలో వివరణ ఇచ్చారు. ఆ సంస్థలో తెలుగు ఎడిటర్‌గా ఉన్న బొమ్మకంటి సింగరాచార్యులు దానిని తీసివేసి వీరభద్ర పళ్ళెంలాగా అని మార్చారు. ముద్రణ జరిగిన తర్వాత రామచంద్ర దాన్ని చూచి, అది సరికాదని వాదించారు. వీరభద్ర పళ్ళెం మార్పు బాగుంది కానీ ఈ మార్పు వల్ల తెలుగు పాఠకులకు ఒక కొత్త సంప్రదాయ జ్ఞానం అందలేదు. అందుకు నిరసనగా రామచంద్ర ఇకపై ఆ సంస్థ వారికి అనువాదం చేయడం మానివేశారు. అది రామచంద్ర తత్వం.
తిరుమల రామచంద్ర రచనల గురించి ఇంకా ఎన్నని చెప్పను. ఏదో ఒక కొత్త విషయం లేకుండా ఏ రచనలు చేయలేదు. ఇవ్వాళ పత్రికలు వాడుతున్న భాషలో ఏది సరైన పదమో, ఏది తప్పో వివరిస్తూ రాసిన 'పలుకుబడి'కి కూడా ఇంతవరకు గ్రంథరూపం ఇవ్వలేదు. తిరుమల రామచంద్ర శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకునైనా ఈ యేడాది, గ్రంథాలుగా రాని వారి రచనలన్నీ వెలుగు చూస్తాయని ఆశిద్దాం.
- టి. ఉడయవర్లు
సీనియర్ జర్నలిస్టు
(జూన్ 17న తిరుమల రామచంద్ర శతజయంతి)

3, జూన్ 2013, సోమవారం

'తన్హాయి'

రాజేశ్వరిలా వెళ్లలేకపోయిన కల్హార జీవితం 'తన్హాయి'

"నా మనసులో నీకోసం ఒక చిన్న ప్లేస్, నా కోసం నీ మనసులో ఒక చిన్న ప్లేస్ దాచుకోవడం వల్ల ఈ పెళ్ళిళ్ళకు పెద్ద భూకంపాలు రావు'' అంటున్నాడు కౌశిక్.
"ఒకే ఒక్క రోజు మేమిద్దరం మా కోసం గడపాలని ఉంది. ఆ రోజు గడిచాక మేమిద్దరం ఒకే అనుభూతిగా మారిపోయిన తర్వాత ఆ స్మృతుల స్మరణతోనే నా జీవితమంతా గడిపేయాలని ఉంది'' పలవరిస్తోంది కల్హార.
అతి చిన్న ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణలోకి నడిచిన ఇద్దరు వివాహిత ప్రేమికుల కథ 'తన్హాయి'.
ం తొలి బ్లాగ్ సీరియల్‌గా 'తన్హాయి' నవలని పోస్ట్ చేస్తున్నపుడూ, ఆ తర్వాత మీ అనుభవాలు?
- 'తన్హాయీ' నవలను ఎప్పటికప్పుడు రాసి పోస్టు చేయడం ఒక కొత్త అనుభవమే కాకుండా ఒక మంచి అనుభవం కూడా. సీరియల్‌గా ఎప్పటిక ప్పుడు ఏ వారానికి ఆ వారం రాయడంలో కష్టసుఖాలు, మంచి చెడ్డలూ రెండూ ఉన్నాయి. తన్హాయి నవల మొదలుపెట్టే నాటికి బ్లాగుల్లో సీరియస్ సాహిత్య చర్చలు ఏవీ జరిగేవి కావు. కాబట్టి నవల బ్లాగులో పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక రకమైన సంశయంతోనే ప్రారంభించాను. మొదటి నాలుగైదు వారాలు ఒకటో, అరో కామెంట్లు వచ్చేవి కానీ రీడర్స్ బాగానే చదువుతున్నట్లు హిట్స్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పాఠకుల సంఖ్య, కామెంట్లు, చర్చలు అన్నీ పెరిగాయి. నవల పూర్తి కాకుండానే దాని మీద అంచనాలు పెరిగిపోయాయి. తీవ్ర అభిమానులు, తీవ్ర వ్యతిరేకులు ఇద్దరూ ఏర్పడిపోయారు. ప్రతి వారం పోస్ట్ చేయగానే నేను రాసినది పాఠకులకు నచ్చినదో, లేదో తెలుసుకోవటానికి కామెంట్లు ఉపయోగపడినప్పటికీ, వాటి ప్రభావం నేను రాయబోయే ఇతర భాగాల మీద పడకుండా నేనురాయాలనుకున్నది రాయటానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాలుగా నా సాహిత్య కృషి అంతా ఒక ఎత్తు. తన్హాయి ఒక్కటే ఒక ఎత్తు అయింది. తన్హాయి అనేకానేక కొత్త రీడర్స్‌ని నాకు సంపాదించి పెట్టింది.
ం స్థల కాల నియంత్రణలూ మార్కెట్ ఒత్తిడులూ లేకుండా పూర్తిగా రచయితల స్వేచ్ఛపై నడిచే 'వ్యక్తిపత్రిక' లాంటిది బ్లాగ్. ఈ మాధ్యమంలో రాయడం వల్ల తన్హాయి నవల వస్తుశిల్పాలు ఏ మేరకు ప్రభావిత మయ్యాయి?
- వస్తువు విషయంలో ఎలాంటి ప్రభావం చూపించిందని నేననుకోవటం లేదు. అయితే శిల్పపరంగా కొంత ప్రభావం చూపించిం దనే అనుకుంటున్నాను. ఒక బ్లాగు పోస్టుగా ఆ వారం చదువు కోవటానికి వీలుగా రాసినప్పుడు శైలిలో కొంత పల్చదనం కానీ, లేదా మొత్తం నవలగా చూసినప్పుడు ఒకచోట ఎక్కడో ఏదో లింక్ పోయినట్లుగానో, లేదా విషయం కొంత సాగదీసినట్లుగానో అనిపించ టానికి ఆస్కారం కలిపించింది. ఉదాహరణకు నవలలో ఉత్తరం అనేది ఎలా కనుమరుగవుతోంది అన్న దాని గురించి రాసిన ఒక ఎపిసోడ్ ఉంది. అది బ్లాగులో వచ్చినప్పుడు ఏమీ అనిపించలేదు కానీ నవల మొత్తంగా చదివేటప్పుడు ఆ ఉత్తరాల గురించి కొంచెం ఎక్కువ రాసినట్లు నాకే అనిపించింది. అలాంటివి నవలలో రెండు, మూడు చోట్ల జరిగాయి.
మార్కెట్ ఒత్తిడులు లేకపోవచ్చేమో కానీ పాఠకుల కామెంట్ల ఒత్తిడి బ్లాగు రచనల మీద ఉంటుంది. ఏ రచయిత అయినా ఆ కామెంట్ల మాయాజాలంలో పడిపోయే ప్రమాదం ఉంది.
ం తన్హాయి నవలని అర్థం చేసుకోవడంలో వ్యాఖ్యానించడంలో అంత ర్జాల పాఠకులకి, ప్రింట్ పాఠకులకి మధ్య వైరుధ్యం ఏమైనా ఉన్నదా?
- చాలా తేడా ఉంది. అంతర్జాల పాఠకులు వేరు, ప్రింట్ పాఠకులు వేరు. అంతర్జాల పాఠకులు కొంత మెట్రో కల్చర్ తెలిసిన వారు. వాళ్లు నవలను అర్థం చేసుకున్న విధానానికి, ప్రింట్ పాఠకులు అర్థం చేసుకునే విధానానికి కొంత తేడా ఉంటుంది. అయితే నవల ఇద్దరినీ మెప్పించింది. ఆన్‌లైన్‌లోనూ, ప్రింట్‌లోనూ నవల సక్సెస్ అవటం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలాగే ఇప్పుడు తెలుగు సాహి త్యాన్ని ఎవరూ చదవటం లేదు, రీడర్స్ తగ్గిపోయారు అన్న వాదన, అలాగే నవలలు చదివే ఓపిక, తీరిక ఎవరికీ లేదు అన్న వాదన, అలాగే కొత్త తరం ముఖ్యంగా యువత తెలుగు పుస్తకాలు చదవటం లేదన్న వాదన.. ఈ మూడు కూడా తప్పని తన్హాయి నవలకు లభించిన స్పందనని బట్టి నాకర్థమయింది.
ఇక స్పందన విషయానికి వస్తే, నవల గురించి అంతర్జాల పాఠకులు ఏమనుకున్నారో తెలిసినట్లు ప్రింట్ పాఠకుల స్పందన నాకు పూర్తిగా తెలియలేదు. ఆన్‌లైన్ పాఠకులు ఏ వారానికి ఆ వారం నవల చదవటంలో ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి కనపర్చారు. మొత్తంగా ఒక పాత్రను అర్థం చేసుకునే వీలు కేవలం ఒక ఎపిసోడ్ చదవటంతో సాధ్యం కాదు. అయినప్పటికీ వాళ్లు ప్రతివారం ఆ ఎపిసోడ్ చదవి, దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని చర్చ చేసి మరో ఎపిసోడ్ కోసం ఎదురుచూసేవారు. ప్రింట్ పాఠకుల విషయానికి వస్తే అలా కాదు. వాళ్లు మొత్తం పుస్తకం ఒకేసారి చదివారు, వారి స్పందన తెలిపే అవకాశం పరిమితమయింది. కేవలం ఈ మెయిల్స్, ఫేస్‌బుక్ ద్వారా మాత్రమే చాలామంది స్పందనను తెలియచేసారు.
ం తన్హాయి నవల సాంప్రదాయక తత్వం ఉన్న పాఠకులకి రాడికల్‌గానూ, స్త్రీ పురుష సంబంధాలను రాడికల్ దృష్టి కోణంతో చూడగలిగిన పాఠకులకు సాంప్రదాయకంగానూ కనపడింది. ఈ ద్వంద్వాన్ని మీరెలా వ్యాఖ్యానిస్తారు?
- ద్వంద్వం అనటం కన్నా, ఒకొక్కరూ ఒక్కోలా అర్థం చేసుకొని వ్యాఖ్యానించారనే నేననుకుంటున్నాను. కేవలం ముగింపు చూసి సాంప్రదాయకం, యాంటీ ఫెమినిజం అని కొందరు, అసలు వివాహా నంతర ప్రేమ అనేది రాడికల్ ఫెమినిజం అని కొందరు వ్యాఖ్యానిం చారు. నేను ఫెమినిజాన్ని సమర్ధిస్తూ, లేదా దాన్ని గౌరవిస్తూ రాయలేదని కొందరు విమర్శిస్తే, నేను అక్రమ సంబంధాలను ప్రోత్సహించటానికే ఇలాంటివి రాశానని మరి కొందరు దుయ్య బట్టారు. రెండు విమర్శలకు నా సమాధానం ఒక్కటే. అది ఏ వాదం కోసం రాసినది కాదు. అదొక నలుగురి జీవితానికి చిత్రిక. అది వాదాల్లో ఒదుగుతుందా? లేదా? అనే వాదనే అసంబద్ధం.
నవల మొత్తాన్ని ముగింపు నుంచి చూసి అది సాంప్రదాయకమని వ్యాఖ్యానించటం సరికాదేమో అంటాను. ఈ నవలలో ముగింపు కంటే కీలకమైనది కల్హార సంఘర్షణ. కుటుంబాన్ని వదిలి వెళ్ళటం, వెళ్లలేకపోవటం అనేవి ఆయా వ్యక్తుల/పాత్రల పరిస్థితులు, వ్యక్తిత్వాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అయినా నవలలో ఇచ్చిన ముగింపు ఒక విధమైన మిడిల్ స్టెప్. ఆ తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో సంఘర్షణ ఉంటుంది. నవలకు ఆ విధమైన వస్తువు తీసు కోవటంలోనే ఒక రకమైన రాడికల్ ధోరణి ఉంది.
కల్హార జీవితంలోకి కౌశిక్ వచ్చాక కల్హార ఆలోచనల్లో కలిగిన మార్పు, సంఘర్షణ, కుటుంబ జీవితం పట్ల ఆమెకున్న అభిప్రాయాలు, చైతన్యతో ఆమె నిజాన్ని ఒప్పుకున్న తీరు, రికన్సిలేషన్ ప్రాసెస్‌కు సిద్ధం కావటం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ ఆధునిక లేదా సమకాలీన జీవితపు చిత్రణ. ఇది నవలలో ఎలా చిత్రతమయింది అన్నది చూడగలిగితే బావుంటుంది.
ం స్వేచ్ఛాయుత ప్రేమ సంబంధాలని చెప్పబడే వాటిలోని స్వేచ్ఛా రాహిత్యం, మానవీయమైన ప్రేమానుభవం కోసం అనంతమైన ఘర్షణ, వైవాహికేతర ఆకర్షణలున్నా అంతిమంగా కుటుంబ విలువలకే కట్టుబడి ఉండడం తన్హాయిలో కనిపించాయి. ఈ నవల ద్వారా మీరు ప్రతి పాదించదల్చుకున్న సారాంశం ఏంటి?
- నేను 2010లో తన్హాయీ రాయటానికి ముందే ఇద్దరు మహా రచయితలు రాసిన రెండు క్లాసిక్స్ నా ముందున్నాయి. ఒకటి చలం రాసిన 'మైదానం', రెండోది టాల్‌స్టాయ్ రాసిన 'అన్నా కెరీనీనా'. రెండూ నాకు ఇష్టమైన పుస్తకాలు, నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు. కానీ ఆ రెండు పుస్తకాలు ఎంత నచ్చినా ఇంకా ఏదో చెప్పలేదనే అసంతృప్తి నాకు ఉంది. రాజేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోయిన తర్వాత జీవితం రాశాడు చలం. వెళ్లటానికి ముందు ఎలాంటి ఘర్షణ చూపించలేదు. అసలు ఎలాంటి ఘర్షణ ఉంటుంది, దాన్ని ఏ స్త్రీ అయినా ఎలా అనుభవిస్తుంది? లేదా ఎలా అధిగమిస్తుంది అన్నది ఎక్కడా ప్రస్తావనకు రాదు 'మైదానం'లో. అలాంటి ఘర్షణ రాయాల్సిన అవసరం లేని నవల 'మైదానం'. అన్నా కెరీనీనా ది మరో రకమైన ఘర్షణ, వేదన. అయితే ఆ ముగింపును, ఆ ఘర్షణను కూడా ఒకొక్కరూ ఒక్కోలా చూస్తుంటారు. ఒకసారెప్పుడో నా ముందు తరం రచయిత ఒకరు ఏదో మాటల సందర్భంలో నాతో, అలాంటి పనులు చేస్తే అలాంటి ముగింపే లభిస్తుందని స్త్రీలకు హెచ్చరికగా టాల్‌స్టాయ్ ఆ ముగింపు ఇచ్చాడు అన్నారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాను. ఆ రెండు పాత్రలకు మధ్య ఉన్న ఎందరో స్త్రీలు నా కళ్ల ముందు కనిపించారు. అలా వెళ్లలేకపోయిన ఎంతోమంది కల్హారల జీవితం తన్హాయి. చలం మైదానం వచ్చాక కూడా కుటుంబాన్ని వదిలి వెళ్లగలిగిన రాజేశ్వరుల కంటే, వెళ్లకుండా ఉండిపోయిన కల్హారలే ఎక్కువమంది ఉన్నారు. వెళ్లలేక పోవటంలోని బాధను, వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధ ఘర్షణను రాశాను. అలాగే వివాహానంతరం కూడా ఇష్టాలు కలగవచ్చునన్నది నవలలో చర్చించిన అంశం, అయితే ఆ ఇష్టం ప్రస్తుత సంబంధం మీద నిరసనతోనో, తిరుగుబాటుగానో కలగడం కాదు. కేవలం ఇష్టం, ఇష్టంగా మాత్రమే నవలలో నేను చిత్రీకరించాను. ఒక వ్యక్తి మీద కలిగే ఇష్టాన్ని ఒక పూలమాల కట్టినట్లు రాశాను. ఆ క్రమ వర్ణన నవలకు ఓ ప్రత్యేకతను, ఓ విశిష్టతను చేకూ ర్చిందనుకుంటున్నాను.
ఈ వందేళ్లలో ఎంతోమంది రాజేశ్వరులను, అన్నా కెరీనినాలను ఈ సమాజం చూసి ఉంటుంది. అయితే ఎంతమంది మేము రాజేశ్వరులం అని ధైర్యంగా ప్రకటించుకున్నారు? ఎంతమంది రాజేశ్వరితో తమను తాము కనెక్ట్ చేసుకున్నారు? అన్నది ఆలోచించాలి. తన్హాయి వచ్చాక ఎంతోమంది పాఠకులు ధైర్యంగా మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని రాశారు. ఒక పాత్ర నచ్చటం వేరు, ఆ పాత్రతో కనెక్ట్ కావటం వేరు. రీడర్స్ కల్హారతో కనెక్ట్ అయ్యారు. అది ముఖ్యం. ఒక రచయితకు కానీ, ఒక పుస్తకానికి కానీ అంతకుమించి కావాల్సిందే ముంటుంది?
ం తన్హాయి నవల రాస్తున్నపుడు మీలోని వ్యక్తికీ రచయితకూ మధ్య ఏకీభావం ఉన్నాదా? (ఘర్షణ ఉంటే ఏ అంశాల్లో?)
- సాహిత్య సృజనలో అన్నీ మన నమ్మకాలకు, విశ్వాసాలకు, దృక్పథాలకు సంబంధించినవి మాత్రమే రాయలేము. మనం అంగీకరిం చని విషయాలను కూడా పాత్రల స్వభావాల రీత్యా రాయాల్సి వస్తుంది. పాత్రలను మన చెప్పు చేతల్లో పెట్టుకోకుండా, స్వేచ్ఛగా వాటిని ప్రవర్తింపచేయటం సరైనదని ప్రతి రచయిత నమ్ముతారు. అయితే అది ఒక్కోసారి సాధ్యం అవుతుంది. కాకపోతుంది. తన్హాయి విషయానికి వస్తే, నాలోని వ్యక్తికి, రచయితకు మధ్య ఏకీభావంతోనే రాశాను.
ం తన్హాయి ద్వారా మీకు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి కదా.. ఆ ప్రస్పందనల్లో మీకు దొరికిన ఆణిముత్యాలు? (వ్యక్తుల పేర్లు కాకుండా సామూహికమైన స్పందనలను చెప్పాల్సిందిగా మనవి.)
- హాహాహాహా. అభిమాన సంఘాల్లేవు. ఏమీ లేవు. ఫేస్‌బుక్‌లో తన్హాయీ నవల మీద చర్చించడానికి ఒక గ్రూప్ ఏర్పడింది. పుస్తకం వచ్చి ఏడాది దాటింది అయినా ఇప్పటికీ ఎవరో ఒకరి నుంచి మీ నవల చదివాము. బాగా నచ్చింది అంటూ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఒక రచయితగా నా కృషి సఫలమైందని సంతోషంగా అనిపిస్తుంది. ఆణి ముత్యాలు అరుదుగా ఉంటాయి కానీ నాకు తన్హాయి విషయంలో ఎక్కువగానే లభించాయి. నవలలో చిన్న చిన్న తప్పులు సరిచేసుకొని ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే తెలుగులో వచ్చిన ఉత్తమ నవలల్లో ఒకటిగా మిగిలిపోయి ఉండేదన్న సద్విమర్శను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.
వందలాది కామెంట్లు నుంచి నేను మర్చిపోలేని కామెంట్ ఆనానిమస్ పేరుతో వచ్చింది. జరిగిన విషయం చైతన్యతో కల్హార, చెప్పేశాక వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చ తర్వాత ఆ అమ్మాయి ఆ కామెంట్ బ్లాగులో పోస్ట్ చేసింది. కల్హార చెప్పినట్లు తాను చెప్పలేకపోయానని, ఈ నవలను నేను ఇంకొంచెం ముందు రాసి ఉంటే తన జీవితమే మారిపోయి ఉండేదని, ఆమె ఎప్పటికీ నన్ను మర్చిపోలేనని కామెంట్ రాసింది. ఇలా నిజజీవితంలో నుంచి ఎందరో కల్హారలు ధైర్యంగా ముందుకు వచ్చి మమ్మల్ని మేము కల్హారలో చూసుకున్నాము అని చెప్పారు. అవన్నీ నాకు దొరికిన ఆణిముత్యాలే. పుస్తకాలు మనుష్యులను ప్రభావితం చేస్తాయన్న విషయం మనందరికీ స్వానుభవమే అయినా ఒక రచయితగా కొంతమంది పాఠకులకు ఈ పుస్తకం ఎంత ఇష్టమయిందో, ఎంత అపురూపమయిందో తెల్సుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను.
ం తన్హాయి ముగిసిందా? కొనసాగుతుందా?
- తన్హాయి పూర్తి కాలేదు. పుస్తకంగా ఒక ముగింపు ఇచ్చాను. నేనిచ్చిన ముగింపు తర్వాత కూడా ఆ నలుగురి జీవితాల్లో ఎంతో ఘర్షణ ఉంటుంది. కథను కొనసాగిస్తూ ఆ ఘర్షణను కూడా చిత్రిస్తూ తన్హాయి రెండో భాగం రాయమని ఎంతోమంది అడుగుతున్నారు కానీ రాయగలనో, లేదో చెప్పలేను. తన్హాయికి మరో రకమైన కొనసాగింపుతో ఇంకో నవల మాత్రం రాస్తున్నాను.
కల్పనా రెంటాల
ఫోన్: 001-512-5355895
 

22, ఏప్రిల్ 2013, సోమవారం

నీలంరాజు

నీలంరాజుగారి సంపాదకత్వం
nagasuri-book-photo‘కథ నడిపిన తీరు బాగానే ఉంది- ఇతివృత్తం నాకు సమ్మతం కాదు’
‘ఇతివృత్తంతో మాకేమి పని? రచన బాగుంది కదా? వేయండి!’
‘అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలు పడదు’
‘క్రమ, అక్రమ సంబంధాల గురించి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసి ఉం టే వేయడమే’
‘ఎడిటర్‌ పోస్ట్‌ మా న్‌ కాదు. పాఠకుల ఎడల అతనికో బాధ్యత ఉంది’
‘ఎడిటర్‌ కర్తవ్యమంతే అయి ఉండాలి’
ఈ ఎడిటర్‌ అట్లా అనుకోవడం లేదు’
- ఇలా రచనను తిరస్కరించింది ‘నవోదయ’ వార ప్రతిక సంపాదకుడు నీలంరాజు వేంకట శేషయ్య. తన మిత్రుడి రచనను ప్రచురింపచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మరో విఖ్యాత పాత్రికేయు డు, సంపాదకుడు గోరా శాస్ర్తి అని తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు. అప్పటి గోరా శాస్ర్తి అదే నవోదయంలో ‘చేగోడీలు తింటూ’ అనే కాలమ్‌ అప్పుడే రాస్తుండడం గమనార్హం. ఇక్కడ నీలంరాజుగారి భావజాలం, గోరా శాస్ర్తిగారి లిబరలిజం బయటపడతాయి.

ఇరవై ఏళ్ళు ఆంధ్ర పత్రికలో, మరో ఇరవయ్యేళ్ళు ఆంధ్ర ప్రభలో పనిచేసిన నీలంరాజు వేంకట శేషయ్యగారి గురించి వారి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఇటీవల ‘కంచి పరమాచార్యుల ప్రియ శిష్యుడు, పత్రికారంగ నిర్దేశకుడు నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని అన్ని సంగతుల గురించి రాసే జర్నలిస్టుల జీవిత విశేషాలు తక్కువగా వెల్లడి అవుతుంటాయి. సంగీతం, నాటక రంగం, సినిమా, ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యేక ఆసక్తి గల నీలంరాజు బాగా రాణించిన పాత్రికేయుడు. 1905 డిసెంబర్‌ 22న జన్మించిన నీలంరాజు ప్రకాశం పంతులు సహాయకుడుగా మొదలై, చివరకు ఒక పెద్ద పత్రిక ఎడిటర్‌గా రూపొందారు. స్వరాజ్య, ఆంధ్రపత్రిక, నాట్యకళ, నవోదయ, ఆంధ్రప్రభ- ఇదీ వారి పత్రికా ప్రస్థానం. 1938లో ఉషాపరిణయం సినిమాలో అనిరుద్ధ పాత్ర వేసిన అందమైన కథానాయకుడు కూడా ఆయనే. భద్రాచలం దేవాలయం జీర్నోద్ధరణకు పత్రికను వినియోగించి ఫలితం సాధించినవారు ఆయన. పరమాచార్య గురించి ‘నడిచే దేవుడు’ అనే పుస్తకరం ప్రచురించిన భక్తుడు కూడా ఆయనే!
‘నాకు అప్పుడు కనిపించింది విషాద యోగంలో మునిగిన విజయుడు కాదు; హాలాహలం మింగిన హరుడు. ఏమా ఠీవి! ఏమా దర్పం! ఎంత రాజసం! ఎవరిలో చూడగలం ఆక్షాత్ర తేజం! మూర్తీభవించిన వీర రసమా? కదలి వచ్చి హిమవన్నగమా?’

- మహాత్మా గాంధీతో విభేదాలు వచ్చినప్పుడు ప్రకాశం పంతులు సంకట స్థితి గురించి వివరించే సందర్భంలో నీలంరాజు కలం చెక్కిన అక్షర శిల్పం ఇది. ఈ పుస్తకంలో అనుబంధంగా ప్రకాశంగారి వాత్సల్యం గురించి, భద్రాచలం రామదాసు ధ్యాన మందిరం గురించి రెండు వ్యాసాలను ఇచ్చారు. ఈ రెండు వ్యాసాల్లో వస్తువు విషయం ఒక వైపు ఉండగా; నీలంరాజుగారి రచనా శైలి చక్కగా పరిచయం చేయడమనేది మరోవైపు స్పష్టంగా కనబడుతుంది.

- పుస్తకం అట్ట మీద పుస్తకం పేరు ఒక విధంగా ఉండగా, లోపలి అట్ట మీద, ప్రతి పుటలోనూ పుస్తకం పేరు ‘మా తండ్రి శేషయ్య గారు’. నిజానికి ఇక్కడేదో సమన్వయ లోపంతో ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ ‘మా తండ్రి శేషయ్య గారు’ అన్నదే సరైన మకుటమని పిస్తుంది. వారి మొదటి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఫస్ట్‌ పర్సన్‌లో చెప్పిన విషయాలకు ఇదే సరైన శీర్షిక కూడా. శేషయ్యగారి జీవిత చరిత్ర ఏదీ లేని సమయంలో ఈ పుస్తకం ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది. జాతీయోద్యమం, విద్యార్ధి దశ, మద్రాసు జీవనం, స్వరాజ్య, ఆంధ్ర పాత్రిేయం, కళాభినివేశం, విదేశీ యాత్రలు- చేసినవీ, విరమించినవీ, నవోదయ, ఆంధ్ర ప్రభ, రామ కార్యాలు, ఆఖరిమలుపులు- ఇవీ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు.

- కొన్ని పుస్తకాలు చేతికి రాగానే ఆ రాత్రో, మరుసటి రోజో చదివేసే సందర్భం ఉంటుంది. అది వేళా విశేషం కాదు. కానీ ఆ పుస్తకం దేని గురించి, ఎవరు రాసింది, మనకు ఉన్న సమయం వంటి అంశాలపై చదవడమనేది ఆధారపడి ఉంటుంది. నన్ను అలా చదివించిన ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మద్రాసునుండి బ్రిటిష్‌వారి అనుకూల పత్రిక మద్రాసు మెయిల్‌, మితవాద పత్రిక ది హిందూతో పాటు గర్జించే ‘స్వరాజ్య’ ఆంగ్లంలో ఉండగా, ఆంధ్రపత్రిక తెలుగులో ఉండేది. ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరేడు గంటల మధ్య కాలంలో విడుదలయ్యేవి.

చాలా కాలం పాటు రిపోర్టర్‌గా ఉన్న కాలంలో కూడా ఆంధ్రపత్రికలో సినిమా పేజీని నీలంరాజు నిర్వహించేవారు.

మొదట హిందూ, ఆంధ్రపత్రిక రెండూ తొలి పేజీలో ప్రకటనలు ఇచ్చేవి. హిందూ తొలి పేజీలో వార్తలు వేసినప్పుడు ఆంధ్రపత్రిక కూడా మార్చింది.

ఆంధ్రపత్రికలో సంపాదకత్వం ముగిసిన తర్వాత 1970- 71లో నీలంరాజు భద్రాచలం ఎటపాక గ్రామంలో వ్యవసాయం చేశారు. దీన్ని నార్ల వెంకటేశ్వరరావు బ్రాహ్మణ వ్యవసాయం అన్నారు.
పత్రికల పేర్లలో వత్తులుండకూడదు. రైల్వే స్టేషన్‌లో పేపర్‌ బాయ్‌ కూడా పలకడానికి సులువుగా పేరుండాలని నీలంరాజు ‘నవోదయ’ అనే పేరును వారపత్రికకు స్వీకరించారు. శ్రీశ్రీ ఎంతటి ఇమేజరీ ప్రవేశపెట్టి రాత రాసేవారో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవారు.
‘నవోదయ’తో చితికి పోయిన నీలంరాజును 1949- 50 లలో నార్ల అడిగి ప్రభలో చేర్పించుకున్నారు. నీలంరాజు ఎడిటోరియల్‌ రైటర్‌గా చేరి, 1959లో ఎడిటర్‌ అయ్యారు.

‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ గొప్ప ఎడిటర్‌ ఎస్‌. సదానంద్‌ వీరుడిలా బతికి బొంబాయిలో చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు. ఇది తెలిసి రామనాథ్‌ గోయంకా ప్రత్యేకంగా విమానంలో సదానంద్‌ దేహాన్ని మద్రాసు తెప్పించి, అంత్యక్రియలు జరిపించారు.
- నీలంరాజు గారి మరిన్ని వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తకాలు చదవాలని ఆసక్తి కలిగించే రీతిలో ఈ పుస్తకం రచించిన లక్ష్మీ ప్రసాద్‌కు అభినందనలు. 

(నాగసూరి వేణుగోపాల్.....వ్యాసం)
|

ఇందు

ఇందు `జై`న్
పత్రికను నడిపించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అందునా ఆంగ్ల పత్రిక అంటే ఎంతో శ్రమ, ఆర్థికంతో కూడుకున్న పని. అలాంటిది ఒకటి కాదు దాదాపు పత్రికలు, మ్యాగజైన్‌లు కలిపి 15 వరకు ప్రచురితం చేస్తున్నారు. ఐదు భాషల్లో వివిధ రకాలుగా వీటిని అందిస్తున్నారు. ఇవన్నీ కూడా టైమ్స్ గ్రూప్‌ కింద నడుస్తున్నాయి. వందల కోట్లతో ఇంత పెద్ద మొత్తంలో సడుస్తున్న సంస్థ చైర్మన్‌ మహిళ అంటే ఆశ్చర్యపోక తప్పదు. మీడియా రంగాన్ని తలలు పండిన హేమాహేమీలే నిర్వహించలేక సతమతమవుతుంటారు. అలాంటిది ఓ మహిళ ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా పత్రికను నడిపించడం ఆమె కృషికి, కార్యదక్షతకు నిదర్శనం అని చెప్పవచ్చు. 77 ఏళ్ల ఆ మహిళే ఇందూ జైన్‌.


- టైమ్స్ గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు
- గుర్తింపు తీసుకురావడంలో విశేష కృషి
- కొత్త పత్రికలు, మ్యాగజైన్ల ఆవిష్కరణ
- 5 భాషల్లో పలు దిన పత్రికలు
- సాయం అందించడంలోనూ ముందే
- మానవతావాదిగా గుర్తింపు
- ఆధ్యాత్మికవేత్త, రచయిత్రి కూడా


దేశంలో అత్యంత పెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి(టైమ్స్ గ్రూప్) సారథిగా వ్యవహరిస్తున్నారు. ఇందు జైన్ షాహు కుటుంబానికి చెందింది. బెన్నెట్ కోల్‌మాన్ అండ్ కో లిమిటెడ్ కంపెనీ సారథిగా వ్యవహరించడమే కాకుండా అమె విద్యావేత్త, మానవాతవాది, కళ పోషణ కలిగిన అధ్యాత్మికురాలు. భారత దేశంలో శక్తివంతమైన మీడియాల్లో ఒకటిగా ఉంటున్న టైమ్స్ గ్రూప్ సీఈఓగా వ్యవహరించడం అంటే ఎంతో కార్యదీక్ష, దక్షత ఉంటేగాని సాధ్యం కానిది. టైమ్స్ గ్రూప్ స్థాపించే సమయంలో భవిష్యత్తును అంచనా వేసి మరీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అచిర కాలంలోనే జాతీయస్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ టైమ్స్ పలువురి ప్రశంసలు అందుకుని ఖ్యాతి పొందింది.

ది టైమ్స్ ఆఫ్ ఇండియా :
ఇది ప్రపంచ ఆంగ్ల పత్రికల్లో అత్యంత సర్క్యూలేషన్ ఉన్న పత్రికగా పేరుపొందింది.
ది ఎకానమిక్ టైమ్స్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న ఫైనాన్షియల్ దిన పత్రిక, ప్రపంచంలో ఇది రెండో స్థానంలో ఉంది.
మహారాష్ట్ర టైమ్స్ :
ఇది మహారాష్ట్ర రాష్ట్రం వరకు వస్తుంది. స్థానిక భాషలోనే ప్రచురితం అవుతోంది.
నవ భారత్ టైమ్స్ :
ఇది మన దేశ రాజభాష అయిన హిందీలో వస్తుంది. ఢిల్లీ, ముంబయ్‌లో ప్రచురణ కార్యాలయాలు ఉన్నాయి.
ముంబయ్ మిర్రర్ :
ఇది మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న కంపాక్ట్ దినపత్రిక.
కోల్‌కతా మిర్రర్, పూనే మిర్రర్, అహ్మదాబాద్ మిర్రర్, బెంగలూర్ మిర్రర్ :
ఇవి ఆయా ప్రాంతాల్లో అక్కడి భాషల్లో ప్రచురితం అవుతున్నాయి.
విజయ్ కర్నాటక :
కర్నాటకలో రెండ దిన పత్రికగా ఆవిష్కరించబడింది.
ఈటి వెల్త్ :
భారత దేశంలో అత్యధిక ఆదరణ ఉన్న ఫైనాన్షియల్ వార పత్రిక
ఫిల్మ్ ఫేర్ :
మన దేశంలో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న మ్యాగ్జిన్.
ఫెమినా :
ఇది మహిళలు, అందం, లైఫ్ స్టైల్ కోసం రూపొందించిన మ్యాగ్జిన్.
ఈ పత్రికలు, మ్యాగ్జిన్లు అన్ని టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలోనూ ఈ పత్రికలు, మ్యాగ్జిన్‌లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఓ మూవీ చానల్ కూడా ఈ గ్రూప్ నడుపుతోంది అది మూవీ నవ్. ఎఫ్ఎం రంగంలోనూ అడుగుపెట్టింది. రేడియో మిర్చి పేరుతో ఎంతో మంది శ్రోతలకు పలు ఆసక్తికర విషయాలను అందిస్తోంది.


వేల కోట్ల టర్నోవర్ గల సంస్థ పనుల్లో తలమునకలై ఉన్నా సామాజిక సేవ, ఆధ్యాత్మికాన్ని మాత్రం మరువలేదు. దీంతో కష్టాల్లో ఉన్న, మహిళా సాధికారత కోసం పోరాడుతున్న వారికి తన వంతు మద్దతు అందించేది. ప్రకృతి బీభత్సం సంభవించినప్పుడు నిరాశ్రయులుగా మిగిలిన బాధితులకు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి సహాయ సహకారాలు అందించేవారు. మన దేశంలో పలు తుపాన్, భూకంపాలు వచ్చినప్పుడు టైమ్స్ రిలీఫ్ ఫండ్ నుంచి విరాళాలు సేకరించి బాధితులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటే వచ్చే మానసిక ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా ఉండదని ఆమె పలుమార్లు చెబుతుంటారు.

ఇందు జైన్ మహిళ వింగ్ ఎఫ్ఐసిసి(ఎఫ్ఎల్ఒ)కు అధ్యక్షురాలిగా వ్యవహరించేవారు. అంతేకాకుండా భారతీయ జానపథ్ అనే ట్రస్ట్‌కు చైర్మన్ బాధ్యతలను నిర్వహించారు. జైన్ దక్షతతో పలు అవార్డులు సొంతం చేెసుకున్నారు. దేశంలో అత్యంత ముఖ్యమైన లిటరిసి అవార్డును అందుకున్నారు. భారతీయ జ్ఞానపీఠ ట్రస్టుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. అమె 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితిలో అత్మ విశ్వాసం, శాంతి మతపరమైన విషయాలపై ఈ సదస్సులో అనర్గళంగా చర్చించింది. జైన్ వ్యాపార విషయంలో మంచి ధనికురాలుగా పేరుపొందింది. రచయిత పట్ల కొంచెం అయోమయంగా ఉండేది. అలాంటి సంఘటనలు జరుగకుండా డిక్టిషన్‌గా రాసుకునేవారు. అంతేకాకుండా జైన్ ఛష్మే బద్దూర్ వంటి సినిమాలకు పాటలు కూడా రాశారు. దూరదర్శన్ వంటి కార్యక్రమాలకు ఇంటర్య్వూలు ఇచ్చేవారు.


సమాజంలో ఏకత్వం కోసం స్థాపించిన ఏకత్వ ఫోరంకు ఆమె దిశానిర్ధేశం చేస్తూ ఉంటారు.
ఈ ఫోరం 2003లో నాటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా
ఆవిష్కరించబడింది. ఫోరం అందిస్తున్న సేవలకు గాను మహాత్మా-మహావీర్ అవార్డును
అందుకుంది. సమాజంలో పలు మంచి పనుల కోసం ఈ ఫోరం కృషి చేస్తోంది.
ఇందులో మొదటిది శాంతి. దేశమే కాదు, ప్రపంచం అంతటా శాంతి నెలకొనాలన్నదే జైన్ ఆశయం. జైన్ ఆశోక్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు సమీర్ జైన్, వినీత్ జైన్.1954లో సమీర్ జన్మించారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా మాతృ సంస్థ అయిన బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌కు ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త, మానవతావాది, కళలు, సంస్క­ృతిని పోషకుడు. ఉపాధ్యక్షుడిగా ది టైమ్స్ గ్రూప్‌ను ప్రపంచ ఖ్యాతి పొందేలా చేయడం వెనుక ఈయన కృషి ఎంతో ఉంది. 1975లో బెన్నట్, కోలిమన్ అండ్ కో లిమిటెడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించి ఉపాధ్యక్షుడి స్థాయి ఎదిగారు. 1986లో వినీత్ జైన్ కూడా కంపెనీ బాధ్యతలు చేపట్టారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.