22, ఏప్రిల్ 2013, సోమవారం

నీలంరాజు

నీలంరాజుగారి సంపాదకత్వం
nagasuri-book-photo‘కథ నడిపిన తీరు బాగానే ఉంది- ఇతివృత్తం నాకు సమ్మతం కాదు’
‘ఇతివృత్తంతో మాకేమి పని? రచన బాగుంది కదా? వేయండి!’
‘అలా కుదరదు. సమాజంలో అక్రమ సంబంధాలను ప్రోత్సహించే వీలు పడదు’
‘క్రమ, అక్రమ సంబంధాల గురించి ఎడిటర్లకక్కరలేదు, బాగా రాసి ఉం టే వేయడమే’
‘ఎడిటర్‌ పోస్ట్‌ మా న్‌ కాదు. పాఠకుల ఎడల అతనికో బాధ్యత ఉంది’
‘ఎడిటర్‌ కర్తవ్యమంతే అయి ఉండాలి’
ఈ ఎడిటర్‌ అట్లా అనుకోవడం లేదు’
- ఇలా రచనను తిరస్కరించింది ‘నవోదయ’ వార ప్రతిక సంపాదకుడు నీలంరాజు వేంకట శేషయ్య. తన మిత్రుడి రచనను ప్రచురింపచేయడానికి ప్రయత్నించిన వ్యక్తి మరో విఖ్యాత పాత్రికేయు డు, సంపాదకుడు గోరా శాస్ర్తి అని తెలుసుకున్నప్పుడు మనం ఆశ్చర్యపోక తప్పదు. అప్పటి గోరా శాస్ర్తి అదే నవోదయంలో ‘చేగోడీలు తింటూ’ అనే కాలమ్‌ అప్పుడే రాస్తుండడం గమనార్హం. ఇక్కడ నీలంరాజుగారి భావజాలం, గోరా శాస్ర్తిగారి లిబరలిజం బయటపడతాయి.

ఇరవై ఏళ్ళు ఆంధ్ర పత్రికలో, మరో ఇరవయ్యేళ్ళు ఆంధ్ర ప్రభలో పనిచేసిన నీలంరాజు వేంకట శేషయ్యగారి గురించి వారి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఇటీవల ‘కంచి పరమాచార్యుల ప్రియ శిష్యుడు, పత్రికారంగ నిర్దేశకుడు నీలంరాజు వేంకట శేషయ్య జీవితం’ అనే గ్రంథాన్ని వెలువరించారు. ప్రపంచంలోని అన్ని సంగతుల గురించి రాసే జర్నలిస్టుల జీవిత విశేషాలు తక్కువగా వెల్లడి అవుతుంటాయి. సంగీతం, నాటక రంగం, సినిమా, ఆధ్యాత్మిక విషయాలలో ప్రత్యేక ఆసక్తి గల నీలంరాజు బాగా రాణించిన పాత్రికేయుడు. 1905 డిసెంబర్‌ 22న జన్మించిన నీలంరాజు ప్రకాశం పంతులు సహాయకుడుగా మొదలై, చివరకు ఒక పెద్ద పత్రిక ఎడిటర్‌గా రూపొందారు. స్వరాజ్య, ఆంధ్రపత్రిక, నాట్యకళ, నవోదయ, ఆంధ్రప్రభ- ఇదీ వారి పత్రికా ప్రస్థానం. 1938లో ఉషాపరిణయం సినిమాలో అనిరుద్ధ పాత్ర వేసిన అందమైన కథానాయకుడు కూడా ఆయనే. భద్రాచలం దేవాలయం జీర్నోద్ధరణకు పత్రికను వినియోగించి ఫలితం సాధించినవారు ఆయన. పరమాచార్య గురించి ‘నడిచే దేవుడు’ అనే పుస్తకరం ప్రచురించిన భక్తుడు కూడా ఆయనే!
‘నాకు అప్పుడు కనిపించింది విషాద యోగంలో మునిగిన విజయుడు కాదు; హాలాహలం మింగిన హరుడు. ఏమా ఠీవి! ఏమా దర్పం! ఎంత రాజసం! ఎవరిలో చూడగలం ఆక్షాత్ర తేజం! మూర్తీభవించిన వీర రసమా? కదలి వచ్చి హిమవన్నగమా?’

- మహాత్మా గాంధీతో విభేదాలు వచ్చినప్పుడు ప్రకాశం పంతులు సంకట స్థితి గురించి వివరించే సందర్భంలో నీలంరాజు కలం చెక్కిన అక్షర శిల్పం ఇది. ఈ పుస్తకంలో అనుబంధంగా ప్రకాశంగారి వాత్సల్యం గురించి, భద్రాచలం రామదాసు ధ్యాన మందిరం గురించి రెండు వ్యాసాలను ఇచ్చారు. ఈ రెండు వ్యాసాల్లో వస్తువు విషయం ఒక వైపు ఉండగా; నీలంరాజుగారి రచనా శైలి చక్కగా పరిచయం చేయడమనేది మరోవైపు స్పష్టంగా కనబడుతుంది.

- పుస్తకం అట్ట మీద పుస్తకం పేరు ఒక విధంగా ఉండగా, లోపలి అట్ట మీద, ప్రతి పుటలోనూ పుస్తకం పేరు ‘మా తండ్రి శేషయ్య గారు’. నిజానికి ఇక్కడేదో సమన్వయ లోపంతో ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. కానీ ‘మా తండ్రి శేషయ్య గారు’ అన్నదే సరైన మకుటమని పిస్తుంది. వారి మొదటి కుమారుడు లక్ష్మీ ప్రసాద్‌ ఫస్ట్‌ పర్సన్‌లో చెప్పిన విషయాలకు ఇదే సరైన శీర్షిక కూడా. శేషయ్యగారి జీవిత చరిత్ర ఏదీ లేని సమయంలో ఈ పుస్తకం ఎంతో కొంత ఊరట కలిగిస్తుంది. జాతీయోద్యమం, విద్యార్ధి దశ, మద్రాసు జీవనం, స్వరాజ్య, ఆంధ్ర పాత్రిేయం, కళాభినివేశం, విదేశీ యాత్రలు- చేసినవీ, విరమించినవీ, నవోదయ, ఆంధ్ర ప్రభ, రామ కార్యాలు, ఆఖరిమలుపులు- ఇవీ పుస్తకంలోని ఏడు అధ్యాయాలు.

- కొన్ని పుస్తకాలు చేతికి రాగానే ఆ రాత్రో, మరుసటి రోజో చదివేసే సందర్భం ఉంటుంది. అది వేళా విశేషం కాదు. కానీ ఆ పుస్తకం దేని గురించి, ఎవరు రాసింది, మనకు ఉన్న సమయం వంటి అంశాలపై చదవడమనేది ఆధారపడి ఉంటుంది. నన్ను అలా చదివించిన ఈ పుస్తకంలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

మద్రాసునుండి బ్రిటిష్‌వారి అనుకూల పత్రిక మద్రాసు మెయిల్‌, మితవాద పత్రిక ది హిందూతో పాటు గర్జించే ‘స్వరాజ్య’ ఆంగ్లంలో ఉండగా, ఆంధ్రపత్రిక తెలుగులో ఉండేది. ఇవి ప్రతిరోజు సాయంత్రం ఆరేడు గంటల మధ్య కాలంలో విడుదలయ్యేవి.

చాలా కాలం పాటు రిపోర్టర్‌గా ఉన్న కాలంలో కూడా ఆంధ్రపత్రికలో సినిమా పేజీని నీలంరాజు నిర్వహించేవారు.

మొదట హిందూ, ఆంధ్రపత్రిక రెండూ తొలి పేజీలో ప్రకటనలు ఇచ్చేవి. హిందూ తొలి పేజీలో వార్తలు వేసినప్పుడు ఆంధ్రపత్రిక కూడా మార్చింది.

ఆంధ్రపత్రికలో సంపాదకత్వం ముగిసిన తర్వాత 1970- 71లో నీలంరాజు భద్రాచలం ఎటపాక గ్రామంలో వ్యవసాయం చేశారు. దీన్ని నార్ల వెంకటేశ్వరరావు బ్రాహ్మణ వ్యవసాయం అన్నారు.
పత్రికల పేర్లలో వత్తులుండకూడదు. రైల్వే స్టేషన్‌లో పేపర్‌ బాయ్‌ కూడా పలకడానికి సులువుగా పేరుండాలని నీలంరాజు ‘నవోదయ’ అనే పేరును వారపత్రికకు స్వీకరించారు. శ్రీశ్రీ ఎంతటి ఇమేజరీ ప్రవేశపెట్టి రాత రాసేవారో, మాట్లాడేటప్పుడు అంత నెమ్మదిగా, ఆవేశం లేకుండా సింపుల్‌గా మాట్లాడేవారు.
‘నవోదయ’తో చితికి పోయిన నీలంరాజును 1949- 50 లలో నార్ల అడిగి ప్రభలో చేర్పించుకున్నారు. నీలంరాజు ఎడిటోరియల్‌ రైటర్‌గా చేరి, 1959లో ఎడిటర్‌ అయ్యారు.

‘ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ గొప్ప ఎడిటర్‌ ఎస్‌. సదానంద్‌ వీరుడిలా బతికి బొంబాయిలో చనిపోయినప్పుడు దహన సంస్కారాలకు కూడా డబ్బు లేదు. ఇది తెలిసి రామనాథ్‌ గోయంకా ప్రత్యేకంగా విమానంలో సదానంద్‌ దేహాన్ని మద్రాసు తెప్పించి, అంత్యక్రియలు జరిపించారు.
- నీలంరాజు గారి మరిన్ని వ్యాసాలు, విశ్లేషణలు, పుస్తకాలు చదవాలని ఆసక్తి కలిగించే రీతిలో ఈ పుస్తకం రచించిన లక్ష్మీ ప్రసాద్‌కు అభినందనలు. 

(నాగసూరి వేణుగోపాల్.....వ్యాసం)
|

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి