30, ఆగస్టు 2018, గురువారం

విశ్వజ్ఞాని స్టీఫెన్‌ హాకింగ్‌



  stephen-hawking ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ మరణించారన్న వార్త ప్రపంచ మానవాళిలో విషాదాన్ని నింపింది. సైన్సు ప్రేమికులు జీర్ణించుకోలేనిది. 76 ఏళ్ల హాకింగ్‌ బుధవారం ఉదయం కేంబ్రిడ్జిలోని తన నివాసంలో శాశ్వతంగా కన్నుమూశారు. ఇటీవలి వరకూ జీవించిఉన్న భౌతిక శాస్త్రవేత్తల్లో అత్యంత ప్రతిభావంతుడిగా ప్రఖ్యాతి పొందిన హాకింగ్‌ శారీరకంగా కదలలేని పరిస్థితుల్లోనే అనేక పరిశోధనలు గావించి మహత్తర ఆవిష్కరణలు చేశారు. ఆయన రాసిన ''కాలం సంక్షిప్త చరిత్ర'' (ఎ బ్రీఫ్‌ హిస్టరీ ఆఫ్‌ టైమ్‌) గ్రంథం కోటి కాపీలు అమ్ముడుపోవడమే కాదు, ప్రజల్లో ఖగోళ భౌతిక శాస్త్రం పట్ల గొప్ప ఆదరణ పెంపొందించింది. ఈ గ్రంథం ఆధారంగా అదే పేరుతో సినిమా కూడా తీశారు. గ్రంథం మాదిరిగా సినిమా కూడా ఆదరణ పొందింది. కాలం ప్రారంభం, కృష్ణ బిలాలు (బ్లాక్‌ హోల్స్‌), సింగులారిటీ వంటి విషయాలపై ఆయన పరిశోధనలు సాగాయి. 1968-70 కాలంలో ఆయన ''సింగులారిటీ థీరమ్‌'' ప్రతిపాదిస్తూ పత్రాన్ని రూపొందించారు. 1974లో పేలిపోతున్న బ్లాక్‌ హౌల్స్‌లో క్వాంటమ్‌ ఎవాపరైజేషన్‌ భావాలను రూపొందించారు. దీనికి ''హాకింగ్‌ రేడియేషన్‌'' అని పేరుపెట్టారు. ఇవన్నీ చాలా గొప్ప శాస్త్రీయ ఆవిష్కరణలు. 'కాలం సంక్షిప్త చరిత్ర'లో ఆయన పేర్కొన్న అనేక అంశాలను గణిత శాస్త్ర సూత్రీకరణల ద్వారా నిరూపించాడు. కాలం ప్రారంభంలో విశ్వ నమూనాను తయారుచేశారు. ఖగోళ వింతలైన బ్లాకహోల్స్‌ (కృష్ణ బిలాలు) పైనా, విశ్వం పుట్టుకపైనా గొప్ప పరిశోధనలు చేశారు. ఆయన రాసిన పాపులర్‌ సైన్సు రచనలు కోట్ల మంది ప్రజలను ఉత్తేజ పరిచాయి. బ్లాక్ హోల్స్‌ పరిశోధనలకు గాను ఆయనకు నోబుల్‌ బహుమతి రావాలి. కాని ఏ సూత్రమైనా ప్రయోగాల ద్వారా నిరూపితమైతేనే నోబుల్‌ బహుమతి ఇవ్వాలన్న నిబంధన ఉంది. హాకింగ్‌ సూత్రం ప్రయోగాత్మకంగా నిరూపించడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ నిరూపితమైనా నిరూపించిన వారికి ఆ బహుమతి అందుతుంది. అందువల్ల హాకింగ్‌కు సాంకేతిక కారణాల రీత్యా నోబుల్‌ బహుమతి వచ్చే అవకాశం లేదు. బహుమతులతో నిమిత్తం లేకుండా హాకింగ్‌ పరిశోధనలు మానవాళి ఆలోచనల్లో తెచ్చిన మార్పులు ఎనలేనివి. 
 
 కుటుంబ జీవితం: jane-hawking 1942 జనవరి 8న ఇంగ్లండులోని ఆక్సఫర్డ్‌లో జన్మించిన హకింగ్‌ 30 ఏళ్ల పాటు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రాచార్చునిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక మనవరాలు ఉన్నారు. హాకింగ్‌ తల్లి ఇసబెల్‌ హాకింగ్‌ బ్రిటిష్‌ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు. అందువల్ల చిన్నప్పటినుండి హాకింగ్‌ కు అభ్యుదయ భావాలు అబ్బాయి. 13వ ఏట హాకింగ్‌ తత్వవేత్త, గణిత శాస్త్ర వేత్త బెర్ట్రాండ్‌ రస్సెల్‌ను ఆదర్శంగా చేసుకున్నాడు. కేంబ్రిడ్జ్‌లో చదువుతుండగానే తన 20వ ఏట జేన్‌ వైల్డ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడి తరువాత వివాహా నికి దారితీసింది. విశేష మేమంటే జేన్‌ను కలుసుకున్న రెండు మాసాలకే 1963 ఆరంభంలో ఆయనకు ఎఎల్‌ఎస్‌ అనే భయంకమైన నరాల వ్యాధి ఉన్నట్లు తేలింది. ఎమ్యోట్రోఫిక్‌ లేటరల్‌ స్క్లెరోసిస్‌ అనే ఈ వ్యాథి సోకినవారు రెండేళ్లకన్నా ఎక్కువ కాలం బతకరు. మహా అయితే నాలుగేళ్ల కన్నా ఎక్కువ బతికినవారు ప్రపంచంలో లేరు. కాని హాకింగ్‌కు ఈ వ్యాధి వచ్చి ఇప్పటికి 48 ఏళ్లు అయింది. ఇదో గొప్ప విషయం. ఈ వ్యాధి సోకిన వారిలో ఒక్కో అంగం క్షీణించిపోతుంది. యువకునిగా ఉన్నప్పుడు గుర్రపు స్వారీ అంటే ఇష్టపడే హాకింగ్‌ క్రమంగా కాళ్ల, చేతులు, గొంతు పడిపోయాయి. చివరికి పూర్తిగా శరీరం కదపలేని స్థితికి చేరుకున్నారు. మాట్లాడలేని ఆయన ఎలక్ట్రానిక్‌ వాయిస్‌ సింథసైజర్‌ ద్వారా మాత్రమే ఏ విషయమైనా చెబుతూ వచ్చాడు. జేన్‌తో వివాహం తన జీవితాన్ని మార్చేసిందని హాకింగ్‌ పేర్కాన్నాడు. 1965లో జేన్‌తో హాకింగ్‌ వివాహం జరిగింది. సాహిత్యంలో డాక్టరేట్‌ పట్టా పొందిన జేన్‌ హాకింగ్‌కు అన్ని విధాలా అండగా నిలిచారు.  
 
విశ్వంపై శాస్త్రీయ విశ్లేషణ: Stephen Hawking అనాదిగా వస్తున్న విశ్వసృష్టి వాదనకు స్టీఫెన్‌ హాకింగ్‌ ''ది గ్రాండ్‌ డిజైన్‌'' అన్న తన గ్రంథంలో శాస్త్రీయమైన సమాధానం చెప్పాడు. భౌతిక శాస్త్ర మౌలిక సూత్రాల్లోకి వెళ్లి ఆయన ఈ సమాధానాన్ని రాబట్టాడు. 'కాలం సంక్షిప్త చరిత్ర' పుస్తకంలో ఆయన ఈ విశ్వం నిర్మాణాన్నీ, నడకనూ వివరించగా ప్రస్తుత గ్రంథంలో విశ్వ ఆవిర్భావం ఎలా జరిగిందో చెప్పాడు. ఈ విశ్వం ప్రకృతి సూత్రాలను అనుసరించి ఆవిర్భవించి, నడుస్తోంది అని హాకింగ్‌ చెప్పాడు. అయితే ఈ సూత్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? దీనికి సంబంధించన ప్రశ్నను తన గత పుస్తకం 'కాలం సంక్షిప్త చరిత్ర' లోనే హాకింగ్‌ వేశాడు. శాస్త్రవేత్తలు గనుక ప్రకృతికి సంబంధించిన అత్యంత ప్రాథమిక సూత్రాలను తెలు సుకోగలిగితే వారు 'దేవుని మెదడును పట్టుకున్నట్లే' అని ఆయన రాశాడు. అంటే ఆయన దేవుడు కాదు భౌతిక శాస్త్ర ప్రాథమిక సూత్రాలే విశ్వ సృష్టికి కారణం అని పేర్కొన్నాడు. ఇప్పుడు తన సరికొత్త పుస్తకంలో ఆ అత్యంత ప్రాథమిక సూత్ర మేమిటో హాకింగ్‌ చెప్పాడు.  
 
ఎం-సిద్థాంతం : 
భౌతిక శాస్త్రవేత్తలు పదార్ధ రూపాన్ని వివరిం చేందుకు రూపొం దించిన ఎం- సిద్ధాంతమే ఈ ప్రాథమిక సూత్రమని ఆయన వివరించాడు. ఎం- సిద్థాంతం ఈ విశ్వసృష్టికి కారణమైన అన్ని రకాల ప్రాథమిక కణాల, శక్తుల లక్షణాలను తెలియజేసే సూత్రం. విశ్వసృష్టి ఎలా జరిగిందో అది వివరిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని గనుక ప్రయోగల ద్వారా నిరూపించడం జరిగితే అప్పుడు విశ్వసృష్టికి సంబంధించి మతాలు చెప్పే సిద్థాంతాలకు పూర్తిగా తెరపడుతుంది. ఎం-సిద్థాంతం ఇంకా సంపూర్ణం కాలేదు. కాని ప్రపం చంలోని శాస్త్రవేత్తలంతా దానితో ఏకీభవిస్తున్నారు. కారణ మేమంటే, విశ్వనిర్మాణానికి సంబంధించి క్వాంటమ్‌ సిద్థాంతం, గురుత్వాకర్షణ సిద్థాంతం చెప్పలేకపోతున్న అనేక సమస్యలను ఈ సిద్థాంతం పరిష్కరిస్తోంది. అయితే గణిత సూత్రాల ఆధారంగా నిర్మితమైన ఎం-సిద్ధాంతం ప్రయోగాత్మకంగా నిరూపితం కావాల్సిఉంది. అప్పుడే సైన్సు దాన్ని పూర్తిగా అంగీకరిస్తుంది. కాని ప్రస్తుతం మానవాళివద్ద నున్న సాంకేతిక పరిజ్ఞానంతో దాన్ని నిరూపించడం కష్టం. ఎందుకంటే దాన్లో పేర్నొన్న సమయాలను కొలవాలంటే మనం అంతరిక్షంలో మహాభారీ పరిశోధనా శాలలు పెట్టాలి. స్టీఫెన్‌ హాకింగ్‌తో సహా భౌతిక శాస్త్రవేత్తలంతా ఈ ఎం-సిద్ధాంతాన్ని అంతిమ సిద్ధాంతంగా చెబుతున్నారు. 'అన్నిటికి సంబంధించిన సిద్థాంతం' అని జపాన్‌ భౌతిక శాస్త్రవేత్త మిచియో కకు దీని గురించి పేర్కొన్నారు. విశ్వాన్ని దేవుడు సృస్టించాడా, లేక దానికదే సృష్టించబడిందా అంటే విశ్వం ఎవరిచేతా సృష్టించబడలేదు. కొన్ని ప్రాథమిక భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా ఆవిర్భవించి, నడుస్తోంది అని హాకింగ్‌ చెప్పాడు.  
 
 
ప్రజా అభ్యుదయవాది : Hawkings స్టీఫెన్‌ హాకింగ్‌ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు గొప్ప అభ్యుదయ వాది కూడా. 1963లో ఆయన వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా తారిక్‌ ఆలీ తదితరులతో ప్రదర్శనలో పాల్గొన్నాడు. 2003లో ఇరాక్‌పై అమెరికా దురాక్రమణను వ్యతిరేకించడమే కాదు ఇది యుద్ధ నేరం అని ధైర్యంగా ప్రకటించాడు. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దురాగతాలకు నిరసనగా ఇజ్రాయిల్‌లో కార్యక్రమాలను బాయకాట్‌ చేశాడు. అణు నిరాయుధీకరణకు మద్దతుగా, సార్వత్రిక ఉచిత వైద్యం కోసం, వాతావరణ మార్పులను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రచారం చేశాడు. హాకిన్స్‌ ప్రయివేటీకరణకు బద్ద వ్యతిరేకి. ప్రజల ఆరోగ్యాన్ని లాభాలకోసం ఉపయోగించుకోవడం దారుణమని చెప్పాడు. ''వైద్య వ్యవస్థను మరిన్ని లాభాలకోసం ఉపయోగించుకోవడం మొదలు పెడితే, మరిని ప్రయివేటు గుత్త సంస్థలు పెరుగుతాయి, వైద్యం మరింత ఖరీదైపోతుంది'' అని పేర్కొన్నాడు.
 
 స్వర్గం లేదు: హాకింగ్‌ శాస్త్రీయ దృక్పథం కలిగిన శాస్త్రవేత్త. ''ఈ విశ్వం సైన్సు సూత్రాలచేత నడుస్తోందని'' చెబుతాడు. 'మతం ఆదేశాల మీద ఆధారపడుతుంది, సైన్సు పరిశీలన, తర్కం మీద ఆధారపడుతుంది' అని పేర్కొంటాడు. గార్డియన్‌ పత్రికలో ప్రచురితమైన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ స్వర్గం అనేది ఒక మిథ్య అని చెప్పాడు. ''మరణానంతర జీవితం లేదు, స్వర్గం లేదు. అదంతా కూడా చీకటిని చూసి భయపడే మనుషులు సృష్టించుకున్న కథ'' అని స్పష్టం చేశాడు. మానవుడు సృష్టిస్తున్న కృత్రిమ మేధస్సు వల్ల మానవాళికి భవిష్యత్తులో ప్రమాదం ఉందన్న వాదనపై హాకింగ్‌ మాట్లాడుతూ ఇలా చెప్పాడు:''రోబోట్‌ల వల్ల మానవాళికి ప్రమాదం ముంచుకొ స్తోందని చాలా మంది అంటున్నారు. కానీ రోబోట్‌ల కన్నా ప్రమాదకరమైంది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ. మనం కోరుకున్న వాటన్నిటినీ యంత్రాలు ఉత్పత్తి చేస్తే అప్పుడు ఆ ఉత్పత్తి ఎలా పంపిణీ జరుగుతోంది అన్న దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. యంత్రాలు ఉత్పత్తి చేసే సంపద పంపకం జరిగితే అప్పుడు ప్రతి వ్యక్తీ విలాసవంతమైన విశ్రాంత జీవితం గడుపుతాడు. అలా కాకుండా యంత్రాల యజమానులు సంపద పంపిణీని అడ్డుకుంటే అత్యధిక ప్రజలు తీవ్రమైన దుర్భరజీవి తాన్ని ఎదుర్కొన వలసి వస్తుంది. పెట్టుబడి మరింతగా పోగుచేసుకోడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ చేస్తున్న ప్రయత్నాలు టెక్నాలజీ లక్ష్యాన్నే మార్చేస్తున్నాయి. ప్రజల సంపద పెంచడం కోసం కాకుండా మానవుల ఉపాధి పోగొట్టడమే దాని లక్ష్యంగా మారిపోయింది. ఈ హెచ్చరికను తీవ్రంగా తీసుకోకపోతే మనం అంతులేని కార్పొరేట్‌ ఆధిపత్యానికి లోనవుతాము. మన రాజకీయ వ్యవస్థనూ, వనరులనూ అమ్ముతూ, కొంటూ ఉండే వాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేథస్సు వెళ్లిపోడానికి మనం అనుమతిస్తే మనం చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది.'' అని స్టీఫెన్‌ హాకింగ్‌ వివరించాడు. ఐన్‌స్టీన్‌ తరువాత ఖగోళశాస్త్ర పరిశోధనల్లో అంతటి గొప్ప శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి గాంచిన స్టీఫెన్‌ హాకింగ్‌ ఐన్‌స్టీన్‌ పుట్టిన రోజునాడే హాకింగ్‌ మరణించడం విశేషం. స్టీఫెన్‌ హాకింగ్‌ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు మనకాలపు మహాజ్ఞాని. అటువంటి మహనీయుని మృతి ప్రపంచ మేథో జీవితానికి తీరని లోటు. ఆయన ప్రజ్ఞాపాటవాలే కాదు వాటిని సాధించడానికి ఆయన జీవితంతో జరిపిన గొప్ప పోరా టం కూడా నేటి తరానికీ, రానున్న తరాలకు స్ఫూర్తివంతమైనదే.