24, అక్టోబర్ 2017, మంగళవారం

మనకు తెలియని యం.ఎస్ - దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు

 



యం.యస్‌. సుబ్బులక్ష్మి గురించి అధ్యయనం 2004వ సంవత్సరంలో ఒక ''వెలుపలి వ్యక్తి'' నుంచి, అదీ తన క్రైస్తవ తల్లిదండ్రులు పెట్టిన పేరుగల వ్యక్తి నుంచి రావటం, కర్ణాటక సంగీత సామ్రాజ్యపు కంచుకోటలో కలవరం రేపింది. నేను తమిళనాట పెరగలేదనే విషయం దానిని మరింత అనుమానాస్పదం చేసింది. ఐతే తొందరలోనే క్షమాభిక్ష వచ్చింది, కొంత మెచ్చుకోలు కూడా దొరికింది. ఐతే మొదట వచ్చిన అభ్యంతరాలు, ఇటీవలి కాలం వరకూ కర్ణాటక సంగీత ప్రపంచాన్ని పరిపాలించిన కొన్ని బృందాలకున్న సెంటిమెంట్లను ఎత్తిచూపాయి. 

యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మకి మతం, భాషా ఎలాంటి సమస్యలనూ తెచ్చిపెట్టలేదు. ఒక బాల మేధావిగా ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో సంగీతాకాశంలో ఉదయించినప్పుడు ఆమె సాంఘిక నేపథ్యం ఆమెపై నిర్హేతుకమైన అయిష్టతను కల్పించి బాధించింది. భారతదేశపు సంప్రదాయ పరాయణ సాంఘిక వాతావరణంలో ఆచారాల కట్టుబాట్ల బిగింపు చూసినప్పుడు వందేళ్ళ క్రితం ఉన్న అపోహలు, అభిప్రాయభేదాలు ఇప్పటికీ సజీవంగా ఉండటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. సంగీతంలోనూ, రాజకీయ జీవితంలోనూ ప్రజాస్వామ్యాన్ని కోరుతూ కొత్తతరం కళాకారులు ప్రవేశించారు. శ్రోతల దృక్కోణాలలో, వారాశించేదానిలో కొత్త పద్ధతులు వచ్చాయి. వర్తమానాన్ని ఉత్సాహవంతంగా చేసి, భవిష్యత్తుని మార్చేవిగా వున్న సవాళ్ళు కర్ణాటక సంగీత సంస్కృతిలో భాగంగా ఉన్నాయి.

16వ శతాబ్దంలో పురందరదాసు ప్రపంచంలోనే అతి కఠినమైన గణిత పూర్వక సంగీత నిర్మాణానికి పునాదులు వేసినప్పటి నుంచీ ఈ సంగీతం ఒక నిరంతరాయపు తేజస్సును తనలో శాశ్వతంగా ముద్రించుకున్నది. రెండు శతాబ్దాల తర్వాత ముగ్గురు అత్యంత ప్రతిభావంతులు, కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా మనకు తెలిసినవారు ఒకే గ్రామంలో సమకాలీనులుగా పుట్టటంతో శాస్త్రీయ యుగోదయం జరిగింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌, శ్యామశాస్త్రిలు ఏర్పరిచిన ఉన్నత ప్రమాణాలు కర్ణాటక సంగీతోత్సవ సంవత్సరాలకూ, ఇరవయ్యవ శతాబ్దపు స్వర్ణయుగానికీ దారితీశాయి. ఈ కాలంలో నైపుణ్యత ఎంతగా పెరుగుతూపోయిందంటే, ఈ కాలంలోనే మహిళా సంగీతకారులలోనే 'త్రిమూర్తులు' అనే పేరుతో రెండు జట్లు రావటం మనం చూశాం. ఈ పుస్తకం ఏ సాహసవంతులకు అంకితమయిందో వారు ఒక జట్టయితే, తర్వాత అందరితో ఆరాధింపబడిన యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ, డి.కె. పట్టమ్మాళ్‌, ఎమ్‌.ఎల్‌. వసంతకుమారిలు మరొక జట్టు. స్వర్ణయుగాన్ని కొనసాగిస్తూ ఆధునిక యుగం ప్రారంభమైంది. అద్భుతమైన గాయకులు ప్రతి ఇంటా చెప్పుకునే పేర్లయ్యారు. ఇరవయ్యవ శతాబ్దానికి, ఇరవయ్యొకటవ శతాబ్దానికీ మధ్యకాలంలో సంచరించే కొత్త తరం - ప్రతిభ కలిగిన విద్యావంతులైన స్త్రీ పురుషులతో కర్ణాటక సంప్రదాయానికి వారి పద్ధతులలోనే న్యాయంచేస్తూ ప్రవేసించింది. వాళ్ళు మన చుట్టూ, ఒకే సమయంలో ప్రేరణనీ, భయాన్నీ కలిగిస్తూ, వారి మార్గాలలో సౌకర్యవంతంగా 

ఉంటూ, భిన్నంగా ఉన్నందుకు భయపడకుండా ఉన్నారు. సంజయ్‌ సుబ్రమణ్యన్‌, పి. ఉన్నికృష్ణన్‌, అభిషేక్‌ రఘురామ్‌ అటువంటి వాళ్ళలో కొద్దిమంది మాత్రమే. ఈ సోదరుల జాబితాలోంచి ఒక పేరుని విడిగా తీసి చెప్పాలంటే, అటి టి.యమ్‌. కృష్ణ, గాయకుడు, పండితుడు, సామాన్య ప్రజానీకపు విశ్వాసాలపై, విలువలపై దాడిచేసినవాడు. మూడు గుణాలు ముప్పేటగా కలిగినవాడు. సామాజిక వాతావరణంలోకి అతను బలవంతంగా ప్రవేశపెట్టిన విషయాలు, యమ్‌.యస్‌. సుబ్బులక్షి ్మ తన పదవ యేట మొదటి రికార్డు ఇచ్చినప్పుడు ఆమెను వెంటాడిన భయాలే.

ఆ కాలంలో ఆందోళన, చిరాకు కలిగించే సమస్యలు లేవంటే - తక్కువ కులాలకు చెందిన కళాకారులను, ఉన్నత కులాలవాళ్ళు అంగీకరించకపోవటం, మహిళా గాయకుల పట్ల పురుషులకున్న అభ్యంతరాలు. యమ్మెస్‌ ఈ రెండింటినీ అధిగమించింది. అందుకు ఆమె సంగీతపు మహా ఔన్నత్యానికి ఆమెను సంస్కృతీకరించటంలో ఆమె భర్త చేసిన తెలివైన నిర్వహణకు మనం ధన్యవాదాలు చెప్పాలి. కానీ సమస్యలు అంతటితో తీరిపోలేదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ''మీరా'' సినిమా (1945) విడుదలయ్యేనాటికి టి.యమ్‌. కృష్ణన్‌ పుట్టలేదు. ఇంకా చెప్పాలంటే మొదటి కొత్తతరపు విప్లవం తెచ్చిన ఫ్లవర్‌ చిల్డ్రన్‌, సమ్మర్‌ ఆఫ్‌ లవ్‌ (1967) సమయంలో కూడా ఆయనలేడు. దాదాపు ఒక దశాబ్దం గడిచాక, ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించి ఆరునెలలు గడిచాక ఆయన వచ్చాడు. కానీ అప్పుడాయన కర్ణాటక సంగీతాన్ని ''బ్రాహ్మణాధిపత్యంతో, పురుషాధిపత్య నిరంకుశ ధోరణి''లో ఉందని, దానికి ''సాంఘిక పునర్నిర్మాణం'' అవసరమని వర్ణించాడు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు.

కృష్ణను తేలిగ్గా తీసిపారెయ్యలేము. అయన తమిళనాడులోని 2.75% బ్రాహ్మణ వర్గంలో భాగమని మాత్రమే కాదు; అతని చర్యలు అతని మాటలను బలపరిచాయి. మద్రాసులో వందేళ్ళ నుంచీ జరుగుతున్న మార్గఝి సంగీత సీజన్‌ నుంచి అతను బైటికి వచ్చేసి, కళలలో ఉన్న వివక్షను ప్రతిఘటించాడు. నగరంలోనే ప్రముఖమైన సభా మంటపాలలో కచేరీలు జరుగుతున్నప్పుడు ఆయన సముద్రతీరంలో జాలర్లకోసం కచేరీ ఏర్పాటు చేశాడు.

కృష్ణ చేసే కొన్ని వాదనలు నిజానికి అతి అనిపిస్తాయి. బహుశ తమిళ బ్రాహ్మణ ఆధిపత్యం సంస్థాగత స్థాయిలో మాత్రమే ఉందేమో. కళాస్థాయిలో తమిళులు కానివాళ్ళు, బ్రాహ్మణేతరులు కూడా ప్రతిభతో ఉన్నతస్థాయికి ఎదిగారు. ''శాస్త్రీయ'' అనే పదం అంటేనే, ''మరీ ఉన్నతులది''గా పేర్కొనటాన్ని అనుమానించాలి. కళ, సాహిత్యం వీటన్నిటినీ వర్గీకరించేటప్పుడు 'శాస్త్రీయ' అనేమాట వాటిలో ఒక ఉన్నతస్థాయికి చేరాలనే ఆశను ఎత్తిచూపుతుంది. కానీ ''సంగీతాన్ని ఆనందించాలన్నా, నేర్చుకోవాలన్నా కొన్ని సాంఘిక, మతపరమైన అవసరాలను సృష్టించటం'' గురించి అతను చేస్తున్నదాడి గురించి కూడా ఆలోచించవలసిందే. కర్ణాటక సంగీతం ''మతపరమైన హిందూ అనుభవంగా కనిపించేలా'' ఉండకూడదనే అతని వాదనలోనూ విషయముంది.

హిందూస్తానీ సంగీతంలో మతపరంగా కనిపించే ఛాయలు కనిపించవు. (ముస్లింల కారణంగానూ, వారున్నప్పటికి - మనం చూసే దృష్టి కోణాన్నిబట్టి). కొన్ని అంచనాల ప్రకారం ఉత్తర భారత సంగీతానికి దక్షిణాదిన విపుల ప్రజాదరణ పెరుగుతోంది. కర్ణాటకలో ఆ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది; కర్ణాటక సంగీత వ్యాకరణాన్ని పురందాసు ఎక్కడ శ్రమించి ఏర్పరిచాడో, అక్కడ భీమ్‌సేన్‌ జోషి, గంగూబాయ్‌ హంగల్‌ హిందూస్థానీ సంగీత ఇంద్రజాలాన్ని వ్యాపింపజేశారు. ఆ ఇంద్ర మాయాజాలం కొనసాగితే దానికి ఒక కారణం, ఉత్తరాది సంప్రదాయం సాపేక్షంగా చూస్తే తేలికగా అందుకునేందుకు వీలుగా ఉండటమే. దక్షిణాది పద్ధతి చాలా కఠినం కావటంతో గొప్పవాళ్ళెవరూ శిష్యులను మిగిల్చి వెళ్ళరు.  కర్ణాటక శుద్ధ సంగీత సారమైన వీణ ధనమ్మాళ్‌కి ఆమె బాణీలో ఆమె శైలిలో పాడేందుకు ప్రయత్నించేవారసలు లేరు. బాల సరస్వతి, బెంగుళూరు నాగరత్నమ్మకి కూడా అంతే. ఆధునిక సంగీత పండితులు చెంబై వైద్యనాధ భాగవతార్‌ నుంచి జి.యన్‌. బాలసుబ్రహ్మణ్యం వరకూ - వారందరినీ సంగీతజ్ఞులైన శ్రోతలు విని ఆనందించారు గానీ వారి సంఖ్య ఊగిసలాడుతూ ఉంటుంది. కారణం వివరించలేనిది కాదు. యమ్మెస్‌ సుబ్బులక్షి ్మ ఒక్కతే ప్రజాదరణ ఏమాత్రం తగ్గని కర్ణాటక గాయని. నిజానికి ఆమెకు ప్రజాదరణ పెరుగుతూ వస్తోంది. ఆమె పాడిన 'సుప్రభాతం' క్యాసెట్ల అమ్మకాన్ని లెక్కలోకి తీసుకుంటే -

సుప్రభాతం గాఢమైన భక్తి విషయంలోనూ, పాడే పద్ధతిలోనూ, యమ్మెస్‌ భక్తి సంగీతం అందంగా, ఉన్నతంగా మరువలేనిదిగా ఉంటుందని ఒప్పుకుంటూనే, టి.యమ్‌. కృష్ణ తను రాసిన ''దక్షిణాది సంగీతం'' అనే పాఠకాదరణ పొందిన పుస్తకంలో ఇలా రాశాడు ''కఠినమైన సంగీత కళలోని గాంభీర్యాన్నంతా కలిగిన మరో ''యమ్మెస్‌ సంగీతం'' ఉండగలిగేది, నిజంగా తయారయ్యేది. దానిని ''దైవత్వ యమ్మెస్‌'' అనే లెజెండ్‌ వల్ల కోల్పోయాం.''

విషాదగీతంలా కనిపించే పైమాట నిజానికి ఉత్సవ గీతమనే చెప్పాలి. ఎందుకంటే ఆ దైవత్వపు లెజెండ్‌ సంగీత కళలోని శృతిలయబద్ధతను తగ్గించలేదు. యమ్మెస్‌ సంగీతం తన సమకాలీనులెవరలోనూ లేనంతగా అన్నిటినీ కలుపుకుని కాంతిని కాపాడుకుంది. ఆమె పాడటం మొదలుపెట్టిన తొంభై సంవత్సరాలలోనూ ఆ కాంతి ఎన్నడూ తగ్గలేదు. 2016లో ఆమె శతజయంతి ఒక చరిత్రాత్మక గుర్తుగా మారుతుంది. భారత ప్రభుత్వం సాంస్కృతిక సంపదతో దేశాన్ని మానవాతీతంగా చేసిన ఏడుగురు ఐకాన్స్‌ని ఎంచుకున్నప్పుడు ఆ ఏడుగురిలో సుబ్బులక్షి ్మ బిస్మిల్లాఖాన్‌తోపాటు ఉంది. బహుశ, ఇంకా ప్రముఖంగా, యమ్మెస్‌ వందవ పుట్టినరోజు సందర్భంగా ఆమె జన్మస్థలమైన మధురైలో ఒక ప్రత్యేక సంగీత నివాళిని మునిమనవరాలైన యస్‌. ఐశ్వర్య (టి. సదాశివం కూతురు, అర్థ శతాబ్దర పాటు యమ్మెస్‌కి గాత్ర సహకారం అందించిన రాధా విశ్వానాధన్‌ మనవరాలే ఐశ్వర్య) అర్పించటం జరుగుతుంది. యమ్మెస్‌ బాణి కొనసాగుతుందనేందుకు అంతకంటే ఉచితమైన నిదర్శనం ఉండదు. దాని గురించి రాధ ఇలా వివరించారు. ''కేవలం పాడటం కాదు, జీవితంలోనూ సంగీతంలోనూ భక్తి, వినమ్రతలుండటం''. శాస్త్రీయ కళలు కాలంతోపాటు నడుస్తూ తమ శాస్త్రీయతను నిలుపుకుంటున్నప్పుడు, యమ్మెస్‌ సంగీతం తాను సంకేతంగా ఉన్న విశ్వజనీన సుగుణాలతో కాలానుగుణంగా నిలిచి ఉంటుంది. నెమ్మదిగా కానీ చాలా గట్టిగా యమ్మెస్‌ కాలాతీతమైన విలువలను ఎత్తిపట్టి, ఆ క్రమంలో తను కూడా కాలతీత మయ్యారు. యమ్మెస్‌ జీవిస్తున్నారు.

మనకు తెలియని యం.ఎస్ - 
దేవదాసీ పుత్రిక నుంచి సంగీత సామ్రాజ్ఞి వరకు 
- టి. జే. ఎస్. జార్జ్ 
తెలుగు అనువాదం : ఓల్గా 


ప్రతులకు, వివరాలకు : 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ,

ప్లాట్ నెం.85. బాలాజీ నగర్,

గుడిమల్కాపూర్, హైదరాబాద్- 500006

ఫొన్ నెం:23521849

పేజీలు; 240, వేల ,150/-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి